AP Tourism : ఏపీలో పర్యాటక రంగం పరుగులు.. సోంపేట, తావిటి మండలాల్లో 3 చిత్తడి నేలలతో టూరిజం కారిడార్
AP Tourism : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని కీలకమైన చిత్తడి నేలలను కలుపుతూ ఒక టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సోంపేట, తావిటి మండలాల్లో విస్తరించి ఉన్న మూడు ప్రధాన చిత్తడి నేలలను అనుసంధానించి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16 చిత్తడి నేలలను గుర్తించామని, వీటి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
చిత్తడి నేలల ప్రాముఖ్యత
చిత్తడి నేలలు జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత రక్షణకు చాలా ముఖ్యమైనవి. ఇవి సహజ కార్బన్ నిల్వలుగా పనిచేస్తాయి. చేపలు, పక్షులు వంటి అనేక రకాల జీవజాతులకు ఆవాసంగా ఉంటాయి. రాష్ట్రంలో ఈ చిత్తడి నేలల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, వాటిని పర్యాటకానికి అనుసంధానించాలని నిర్ణయించింది. మంగళగిరిలోని తన క్యాంపు ఆఫీసులో రాష్ట్ర చిత్తడి నేలల అథారిటీ నిర్వహించిన సమావేశానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించి ఈ వివరాలను వెల్లడించారు. సోంపేట, తావిటి మండలాల్లో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న పెద్ద బీల, చిన్న బీల, తుంపర వంటి మూడు చిత్తడి నేలలను కలుపుతూ భారీ పర్యాటక కారిడార్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips

కొల్లేరు లేక్ అథారిటీ, అంతర్జాతీయ గుర్తింపు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 చిత్తడి నేలలను గుర్తించి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో చిత్తడి నేలలను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయని వెల్లడించారు. కొల్లేరు లేక్ మాదిరిగానే మరిన్ని చిత్తడి నేలలకు రామ్సర్ లాంటి అంతర్జాతీయ గుర్తింపు లభించేలా అటవీ శాఖ, వన్యప్రాణి విభాగం చర్యలు తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
చిత్తడి నేలల గుర్తింపులో ఏపీ ముందంజ
చిత్తడి నేలలను గుర్తించడం, అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని 16 చిత్తడి నేలలకు ఒకేసారి టెక్నాలజీ, ఫిర్యాదుల కమిటీల ఆమోదం లభించిందని, వాటిని అధికారికంగా గుర్తించి నోటిఫై చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 2018లోనే సోంపేట ప్రాంతంలోని చిత్తడి నేలలను తాను స్వయంగా పరిశీలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్ అవసరాలు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ చేపట్టామని ఆయన వివరించారు. అనంతపురం జిల్లాలోని వీరాపురం, రాజమహేంద్రవరం పుణ్యక్షేత్రాల సమీపంలోని చిత్తడి నేలలు అరుదైన పక్షులకు ఆవాసంగా ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పక్షుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.