హైదరాబాద్ నుంచి గ్యాంగ్‌టక్ 5 ట్రిప్ గైడ్ : Gangtok Travel Guide
Gangtok Travel Guide : గ్యాంగ్‌టక్ ప్రయాణం.. హైదరాబాద్ నుండి బాగ్డోగ్రా మీదుగా 1650 మీటర్ల ఎత్తులో ఉన్న సిక్కిం రాజధాని, కాంచన్‌జంగా వ్యూ, చంగు లేక్, నాథూ లా పాస్, ఎంజీ మార్గ్, రుమ్టెక్ మొనాస్టరీ, బడ్జెట్, ఫుడ్, స్టే పూర్తి గైడ్
ఉదయం ఐదు గంటలకే కిటికీ తెరవగానే, ఎదురుగా కాంచన్‌జంగా కనిపిస్తుంది. ఆ తొలి వెలుగులో మనసులో ఉన్న అలజడులన్నీ మెల్లగా కరిగిపోతాయి. ఇక్కడి ప్రశాంతత జీవితాన్ని మరో కోణంలో చూపిస్తుంది.
ముఖ్యాంశాలు
గ్యాంగ్‌టక్ అంటే సిక్కిం గుండె చప్పుడు లాంటిది. సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న క్యాపిటల్ సిటీ, ప్రకృతితో మనిషి కలిసి జీవించే విధానానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. ఇక్కడ అంత ఎండ ఉండదు. మేఘాలు మెల్లగా సాగుతాయి. ప్రతి సందులో ఒక బౌద్ధారామం అంటే మోనాస్టరీ లేదా గుంపా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు ఒక చిన్న పూల తోట కనిపిస్తుంది.
సందర్శనీయ ప్రదేశాలు | Places To Visit
గ్యాంగ్‌టక్ ను హడావిడిగా ఎక్స్ప్లోర్ చేయడం కన్నా… ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎంజీ మార్గ్‌లో అంటే అక్కడి మాల్ రోడ్డులో సాయంత్రం వాక్ చేయడం ఒక ట్రీట్ లా ఉంటుంది. ఈ మార్గంలో కార్లు ఉండవు. ఈ వీధిలో కాఫీ తాగుతూ, స్నాక్స్ తింటూ ప్రశాంతంగా నడవడం కూడా ఒక మెమరీయే. రాత్రి సమయంలో వెలిగే దీపాలు, చిన్న చిన్న షాపుల్లో లభించే సిక్కిం హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు, శాలువలు ఆకట్టుకుంటాయి.
కొంచెం ఎత్తున ఉన్న ప్రదేశానికి వెళ్తే ఎంచే మొనాస్టరీ కనిపిస్తుంది. 200 సంవత్సరాల నాటి ఈ గుంపాలో, లామాలు చదివే మంత్రాలు వీచే చలి గాలితో కలిసి మనసుకు ప్రశాంతతనిస్తాయి. అక్కడి నుంచి చూస్తే గ్యాంగ్‌టక్ నగరం మొత్తం ఒక చిన్న బొమ్మలా కనిపిస్తుంది.
రుమ్టెక్ మొనాస్టరీ ఒక పెద్ద విశ్వవిద్యాలయంలా అనిపిస్తుంది. గోడల మీద ఉన్న రంగురంగుల చిత్రాలు, బంగారంతో చేసిన బుద్ధ విగ్రహాలు, అక్కడి సైలెన్స్ అన్నీ కలిసి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి.
- ఇది కూడా చదవండి : Phugtal Monastery : హిమాలయాల్లో రహస్య ఆధ్యాత్మిక జీవనం
12,400 అడుగుల ఎత్తులో చుట్టూ మంచు కొండల మధ్య నీలి రంగులో అద్దంలా మెరిసే చంగు లేక్ (Tsomgo Lake) ఇక్కడి ప్రధాన టూరిస్ట్ డెస్టినేషన్లలో ఒకటి. యాక్ అంటే జడల బర్రెలు మెల్లగా ముందుకు నడిచే సమయంలో వాటి మెడలో ఉన్న గంటల నుంచి వచ్చే శబ్దం, నీటిపై పడిన మేఘాల రిఫ్లెక్షన్ ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఎలా వెళ్లాలి? | Hyderabad To Gangtok Travel Guide
హైదరాబాద్ నుండి గ్యాంగ్‌టక్ ప్రయాణం ఒక మంచి అనుభవంతో మొదలవుతుంది. శంషాబాద్ నుండి బాగ్‌డోగ్రాకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. రెండు గంటల ప్రయాణం తర్వాత, బాగ్డోగ్రాలో దిగగానే, అక్కడి నుండి ఘాట్ రోడ్డు మొదలవుతుంది. బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్‌టక్ వరకు 125 కిలోమీటర్ల జర్నీ సుమారు 5 గంటల కారు ప్రయాణం.
దారి పొడవునా మొత్తం తీస్తా నది మనతో పాటు జర్నీ చేస్తున్నట్టు ఉంటుంది. ఒక వైపు పర్వతాలు, మరో వైపు లోయలు, మధ్య మధ్యలో చిన్న చిన్న జలపాతాలు, అక్కడక్కడా టీ తోటలు, ఈ దృశ్యాలు చూస్తూ వెళ్తుంటే అలసటే తెలియదు.
విజయవాడ నుంచి వచ్చే వాళ్లు కోల్‌కతా మీదుగా బాగ్‌డోగ్రాకి వెళ్లవచ్చు. లేదంటే హైదరాబాద్ మీదుగా కూడా వెళ్లవచ్చు. రైలులో వెళ్లాలి అనుకునే వారు, హైదరాబాద్ నుండి ఎన్జేపీ అంటే న్యూ జల్పాయిగురి వరకు రైలులో వెళ్లి, అక్కడి నుండి గ్యాంగ్‌టక్ కి కారు తీసుకోవచ్చు.
రైలు ప్రయాణంలో బెంగాల్ పొలాలు దాటగానే, మెల్లమెల్లగా కొండలు మొదలవుతాయి. గాలి చల్లబడుతుంది. మనసులో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఇక్కడే అసలు జర్నీ మొదలవుతుంది.
గ్యాంగ్‌టక్‌లో స్టేని సింపుల్‌గా ఎలాంటి హడావిడి లేకుండా, ఇంట్లో ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. పెద్ద పెద్ద హోటల్స్ కన్నా, చెక్కతో కట్టిన చిన్న హోమ్ స్టేలు, ఫ్యామిలీ రన్ గెస్ట్ హౌస్‌లు చాలా బాగుంటాయి.
ఉదయం లేవగానే బాల్కనీలోకి వస్తే, ఎదురుగా కాంచన్‌జంగా, కింద లోయలో తేలిపోతున్న మేఘాలు కనిపిస్తాయి. రూముల్లో చెక్క ఫ్లోరింగ్, హీటర్, చలికి తగ్గ దుప్పట్లు, బయట చిన్న తోటలో ఆర్కిడ్ ఫ్లవర్స్, ఈ చిన్న చిన్న విషయాలే మనసుకి హాయిని ఇస్తాయి.
ఎంజీ మార్గ్ దగ్గర ఉంటే, సాయంత్రం వాక్ చేయడానికి బాగుంటుంది. కొంచెం దూరంలో, తాషి వ్యూ పాయింట్ దగ్గర ఉంటే, ఉదయం కాంచన్‌జంగా ను చూడటానికి అనుకూలంగా ఉంటుంది. చాలా చోట్ల, ఇంట్లో వంట చేసి పెట్టే ఆతిథ్యం దొరుకుతుంది, వాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడితే సిక్కిం జీవన విధానం గురించి తెలుస్తుంది.
ఏం చూడాలి? | Gangtok tourist places
గ్యాంగ్‌టక్ వెళ్తే చెక్ లిస్ట్ పెట్టుకుని వరుసగా అన్ని ప్రదేశాలు కవర్ చేయడం కన్నా… అక్కడి వైబ్‌ను ఫీల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఉదయం 5 గంటలకి తాషి వ్యూ పాయింట్లో నిలబడితే కాంచన్‌జంగా పై పడే తొలి సూర్యకిరణాన్ని, ఆ సమయంలో వచ్చే గోల్డెన్ షేడ్స్‌ను చూడవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో వెళ్తే ఈ వ్యూ లభించే అవకాశం ఎక్కువ.
- ఇది కూడా చదవండి : Agumbe : మేఘాల్లో దాగిన గ్రీన్ స్వర్గం!
నాథూ లా పాస్ దగ్గర గడ్డకట్టిన మంచు కొండలు, ఇండియా-చైనా బోర్డర్ వద్ద దేశాన్ని రక్షణ గోడలా నిలబడి ఉన్న సైనికుల నిశ్చలమైన చూపు, అక్కడ ఎగిరే త్రివర్ణ పతాకాన్ని చూస్తే ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుంది. బంజాక్రి ఫాల్స్ దగ్గర నీళ్లు పర్వతం మీద నుంచి దూకుతుంటే దాని ముందు మనిషి చాలా చిన్నవాడిలా అనిపిస్తాడు.
ఏం తినాలి? | Gangtok Food
గ్యాంగ్‌టక్‌లో ఫుడ్ అంటే సిక్కిం సంస్కృతిని తెలుసుకోవడమే. వేడి వేడి మోమోస్, లోపల చికెన్, చీజ్, లేక ఆకుకూరలతో నింపిన మోమోస్‌ని, ఎర్ర చట్నీతో తింటే చలి ఎగిరిపోతుంది అనిపిస్తుంది. తుక్పా అంటే టిబెటన్ స్టైల్ నూడిల్ సూప్, చాలా పెద్ద బౌల్లో వెజిటబుల్స్, నూడిల్స్, కొంచెం సూప్‌తో ఇస్తారు. ఈ ఫ్లేవర్ మనకు తెలుగు రాష్ట్రాల్లో అంత ఈజీగా లభించదు.
తుక్పాతో పాటు ఇక్కడ లభించే గుండ్రుక్ సూప్, కినెమా కర్రీ రుచి కొత్తగా ఉంటాయి. ఎంజీ మార్గ్‌లో ఉన్న చిన్న బేకరీలో, చీజ్ కేక్, వాల్నట్ కేక్, వేడి కాఫీతో కలిసి మేఘాలను చూడటం అనేది సింపుల్‌గా అనిపించే సూపర్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోతుంది.
ఇవి మిస్ అవ్వకండి! | Activities in Gangtok
గ్యాంగ్‌టక్‌లో యాక్టివిటీస్ లేదా అడ్వెంచర్ స్కోప్ తక్కువ. అయితే అక్కడ గడిపే ప్రతి క్షణం మనసుకు హాయినిస్తుంది. ఎంజీ మార్గ్‌లో ఏమీ కొనకుండా విండో షాపింగ్ చేయడం, ఒక చోట కూర్చుని అలా కొద్దిసేపు జనాన్ని గమనించడం కూడా ఒక అనుభవమే.
- ఇది కూడా చదవండి : Key Monastery Spiti: ఓవర్ టూరిజం కాకముందే చూసేయండి… స్పితీ వ్యాలీ!
రుమ్టెక్ మొనాస్టరీలో లామాలు చేసే ప్రార్థన వింటూ కొంతసేపు కళ్లు మూసి కూర్చోవడం ఆధ్యాత్మిక అనుభవం. చంగు లేక్ దగ్గర యాక్ సవారీ, దాంతో ఫోటోలు దిగడం చాలా సరదాగా ఉంటుంది. రోప్ వేలో గ్యాంగ్‌టక్ నగరాన్ని పైనుంచి చూడటం, కింద చిన్న చిన్న ఇళ్లు, గుంపాల్లో ప్రశాంతత, స్కూల్లో పిల్లల హడావిడీ ఇవన్నీ మనం మరో ప్రపంచంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి.
యాత్ర, బడ్జెట్ వివరాలు | Budget, Stay and Food Expenses
Gangtok trip budget : గ్యాంగ్‌టక్ యాత్రకి 5 రోజుల ప్లాన్ సరిపోతుంది. హైదరాబాద్ నుండి సిక్కిం వెళ్లేందుకు ఫ్లైట్ జర్నీయే బెటర్. సిక్కింలో ప్రస్తుతం ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అదే ప్యాక్యాంగ్ ఎయిర్పోర్ట్. అయితే ఇది అంత యాక్టివ్ విమానాశ్రయం కాదు. వాతావరణ మార్పుల వల్ల విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది.
అందుకే ఎక్కువ సర్వీసులు ఉండే బాగ్డోగ్రా (IXB)కు టికెట్ బుక్ చేసుకుంటే ఉత్తమం. హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రాకు (Hyderabad to Gangtok flight) వన్ వే టికెట్ సీజన్‌ను బట్టి రూ.14 వేల నుంచి రూ.26 వేల వరకు ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గ్యాంగ్‌టక్ చేరుకోవచ్చు. అడ్వెంచర్ లవర్స్ కోసం హెలికాప్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.3100 కాగా 35 నిమిషాల్లో గ్యాంగ్‌టక్ చేరుకోవచ్చు.
ఇక స్టే విషయానికి వస్తే మీరు రూ.666 నుంచి రూ.5,600 మధ్యలో మీ బడ్జెట్‌ను, వ్యూ ఛాయిస్‌ను బట్టి రూమ్ బుక్ చేసుకోవచ్చు. అయితే కాంచన్‌జంగా వ్యూ ఉండే హోటల్స్ కాస్త కాస్ట్లీగా అంటే రూ.7,000 నుంచి రూ.12,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది.
ఫుడ్ కోసం రోజుకు రూ.500 నుంచి రూ.1,300 వరకు మీ బడ్జెట్లో కేటాయించవచ్చు. మొత్తంగా 5 రోజుల ట్రిప్ కోసం మీ ట్రావెల్ స్టైల్‌ను బట్టి రూ.28,000 నుంచి రూ.60 వేల వరకు కేటాయించడం ఉత్తమం. విజయవాడ నుండి ప్లాన్ చేసే వారు అదనంగా రూ.3,000 నుండి రూ.5,000 కలుపుకోవడం బెటర్.
- ఇది కూడా చదవండి : Tawang Travel Guide : హిమాలయాల మధ్య ధ్యానం లాంటి ప్రదేశం తవాంగ్
ఆసక్తికరమైన విషయాలు | Interesting Facts
- గ్యాంగ్‌టక్ సిక్కిం రాష్ట్ర రాజధాని. ఇది 1650 మీటర్ల ఎత్తులో ఉంది.
- కాంచన్‌జంగా ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వతం. గ్యాంగ్‌టక్ నుండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది.
- చంగు లేక్ సముద్ర మట్టానికి 12,400 అడుగుల ఎత్తులో ఉన్న గ్లేషియర్ లేక్.
- నాథూలా పాస్ 14,140 అడుగుల ఎత్తులో ఉన్న ఇండియా-చైనా బోర్డర్.
- సిక్కిం ఇండియాలో తొలి ఆర్గానిక్ స్టేట్‌గా గుర్తింపు పొందింది.
ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోండి.
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
ఇది చదవండి : థాయ్‌లాండ్ ట్రావెల్ గైడ్
