Heli-Tourism: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి హెలి-టూరిజం సేవలు షురూ.. కంప్లీట్ డీటెయిల్స్ ఇవే
Heli-Tourism: తెలంగాణ పర్యాటక రంగంలో సరికొత్త ఉత్సాహం రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హెలి-టూరిజం సేవలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. తొలి దశలో హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించాలని పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పర్యాటకానికి కొత్త రూపాన్ని ఇస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్-శ్రీశైలం: కేవలం గంటలోనే ప్రయాణం
హెలికాప్టర్ సేవలు హైదరాబాద్ – శ్రీశైలం మధ్య అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం చేరుకోవడానికి దాదాపు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. అయితే, హెలికాప్టర్లో ప్రయాణిస్తే కేవలం ఒక్క గంటలో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగులు, కుటుంబాలు, అంతర్జాతీయ పర్యాటకులు వారాంతపు ప్రయాణాల కోసం ఈ సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.

నల్లమల అందాలు ఆకాశం నుంచి
హైదరాబాద్ నుంచి బయలుదేరే హెలికాప్టర్ నల్లమల అడవులు, సోమశిల, అమరగరి వంటి ప్రాంతాల అందాలను పై నుంచి చూపిస్తూ శ్రీశైలం చేరుకునేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌ను రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనున్నారు. పర్యాటక శాఖ ఈ సేవలను ఈజ్ మై ట్రిప్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని నిర్వహించనుంది.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
తొలి దశలో వీకెండ్ సర్వీసులు
మొదట్లో ఈ హెలికాప్టర్ సేవలను కేవలం వారాంతాల్లో మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి క్రమంగా ఈ సేవలను విస్తరించనున్నారు. ఒక్కో హెలికాప్టర్లో ఆరు నుంచి ఎనిమిది మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది.
టూర్ ప్యాకేజీలు, బుకింగ్ వివరాలు
పర్యాటక శాఖ ఈ హెలి-టూరిజంను రెండు లేదా మూడు రోజుల ప్యాకేజీగా ప్లాన్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం, శ్రీశైలం దర్శనం, వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి. టికెట్ ధరలను త్వరలోనే నిర్ణయిస్తారు. బుకింగ్‌ల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్, మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
రెండో దశలో రామప్ప, లక్నవరం
హెలి-టూరిజం విజయవంతమైతే, రెండో దశలో వరంగల్, ములుగు జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు వంటి ప్రాంతాలకు కూడా హెలికాప్టర్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థానం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.