Bogatha Falls : గుడ్ న్యూస్.. తెలంగాణ నయాగారా చూసేందుకు పర్మీషన్ వచ్చేసింది.. ఎప్పుడు వెళ్తున్నారు
Bogatha Falls : తెలంగాణ పర్యాటకులకు గుడ్ న్యూస్. ములుగు జిల్లాలోని వాజేడు మండలం, చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం సందర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బొగత జలపాతం వద్ద వరద ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా అధికారులు సందర్శనను నిలిపివేశారు. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో, మళ్లీ పర్యాటకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జలపాతం కింద ఏర్పడిన నీటి కొలనులోకి దిగడం మాత్రం నిషేధించబడింది. వన అధికారులు పర్యాటకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ నిబంధన విధించారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో అనుమతి లేకుండా జలపాతాల వద్దకు వెళ్లే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పర్యాటకులు అధికారుల సూచనలను పాటించాలని, సురక్షితంగా జలపాతం అందాలను ఆస్వాదించాలని కోరారు.
తెలంగాణకు గర్వకారణమైన బొగత జలపాతాన్ని ఎందుకు నయాగరాతో పోలుస్తారో, ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. బొగత జలపాతం డ్రోన్ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ దృశ్యాలను చూస్తే చాలు, అక్కడికి వెళ్లాలని అనిపిస్తుంది. వర్షాకాలం వస్తే బొగత జలపాతం మరింత అందంగా మారుతుంది. ఈసారి ఈ అందమైన జలపాతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పచ్చని దట్టమైన అటవీ ప్రాంతం, కొండకోనల మధ్య నుంచి హోరెత్తే నీటి హోయలతో నిండిన బొగత జలపాతం ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో ఒకటి. 30 అడుగుల ఎత్తు నుంచి దూకే నీటి ధారలు, కింద పెద్ద జలాశయంగా ఏర్పడతాయి.
ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామంలో ఈ జలపాతం ఉంది (ప్రస్తుతం ములుగు జిల్లాలో భాగం). ఇది కాళేశ్వరం-భద్రాచలం అటవీ ప్రాంతాల మధ్య దట్టమైన అటవీ సౌందర్యం నడుమ వెలసింది. దీనిని మెటల్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. స్థానికంగా దీనిని పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు. బొగత జలపాతం హైదరాబాద్ నుండి సుమారు 280-330 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప ప్రధాన పట్టణాలైన ఏటూర్ నాగారం నుండి 23 కి.మీ, వరంగల్ నుండి 123 కి.మీ, భద్రాచలం నుండి 123 కి.మీ. దూరంలో ఉంటుంది.
జలపాతానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. పర్యాటకులు తమ వాహనాలను పార్కింగ్ స్థలంలో వదిలి, జలపాతం వద్దకు చేరుకోవడానికి సుమారు 2.5 కి.మీ. దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ మార్గం కూడా పచ్చని ప్రకృతితో నిండి, ఆహ్లాదకరంగా ఉంటుంది. బొగత జలపాతాన్ని సందర్శించడానికి బెస్ట్ టైం వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) , వర్షాకాలం తర్వాత (అక్టోబర్ నుండి నవంబర్). ఈ సమయంలో జలపాతం పూర్తి ప్రవాహంతో ఉంటుంది. అప్పుడు ప్రకృతి అందాలు కనుల పండువగా కనిపిస్తాయి. వేసవిలో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
జలపాతం మాత్రమే కాకుండా పైన చిన్న భోగటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది స్థానికులకు పవిత్ర ప్రదేశం. జలపాత అందాలను వీక్షించడానికి ఒక వాచ్ టవర్ కూడా అందుబాటులో ఉంది. చుట్టుపక్కల ఉన్న సీతాఫలం అటవీ ప్రాంతంలో సైక్లింగ్, బర్డ్ వాచింగ్, పిక్నిక్, ఫోటోగ్రఫీ వంటివి చేయవచ్చు. రంగురంగుల సీతాకోకచిలుకలతో నిండిన బటర్ ఫ్లై గార్డెన్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. సాహస ప్రియులు ముందుగా అనుమతి తీసుకుని పరిసర ప్రాంతాల్లో క్యాంపింగ్ చేసుకోవచ్చు.
బొగత జలపాతం సహజ సిద్ధమైన ప్రాంతం కాబట్టి, కొన్ని భద్రతా జాగ్రత్తలు తప్పనిసరి. రాళ్ళు జారే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా నడవాలి. జలపాతం కింద కొలనులో దిగడం నిషేధించబడింది. పర్యాటకులు గుంపులుగా వెళ్లడం, అధికారుల సూచనలను తప్పక పాటించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటివి గుర్తుంచుకోవాలి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.