దేవతలే ప్రతిష్టించిన 4776 ఏళ్ల నాటి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం | Malluru Hemachala Lakshmi Narasimha Swamy
ఈ దేశంలో, కొన్ని ఆలయాలు మాత్రం వాటి విశిష్టత, అద్భుతమైన స్థలపురాణాలతో భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి అద్భుతమైన, రహస్యాలతో నిండిన పవిత్ర పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని మల్లూరులో ఉన్న Malluru Hemachala Lakshmi Narasimha Swamy ఆలయం.
ఇక్కడ నరసింహ స్వామి స్వయంభువుగా వెలిశాడని, కొంతమంది దేవతలే స్వయంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విషయం— స్వామి విగ్రహానికి చర్మం, వెంట్రుకలు, స్వేదం ఉంటాయట. మూల విరాట్ విగ్రహం అచ్చం మనిషి చర్మంలా మృదువుగా ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
ముఖ్యాంశాలు
మల్లూరుకు ఎలా వెళ్లాలి? | How To Reach Malluru
ములుగు (Mulugu) జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న ఈ ఆలయాన్ని హేమాచల నరసింహ స్వామి ఆలయంగా పిలుస్తారు. మల్లూరు, భద్రాచలం నుండి సుమారు 90 కిలోమీటర్లు, వరంగల్ (Warangal) నుండి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ ఆలయం ఎటూరునాగారం – భద్రాచలం (Bhadrachalam) హైవేలోని మంగపేట గ్రామం నుండి అడవిలోకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాచలం నుంచి హనుమకొండ వైపు (ఎటూరునాగారం – మనుగురు మార్గంలో) ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మంగపేట చేరిన తర్వాత ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. మల్లూరుకు కొన్ని ప్రత్యేక బస్సులు కూడా నడుస్తాయి.
- ఇది కూడా చదవండి : తెలంగాణలోని ఈ ఆలయానికి వెళ్తే అరుణాచలం వెళ్లినట్టే…| Chinna Arunachalam
ప్రతి సంవత్సరం ఏప్రిల్ – మే నెలల్లో వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ నుండి జూన్ వరకు భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.
చాలా మంది ఈ ఆలయానికి రావడానికి ప్రధాన కారణం — ఇక్కడ ఉన్న అంతుచిక్కని రహస్యాలు, అపారమైన విశేషాలే.
అడవిలోని కొండపై వెలసిన ఆలయం | Location
అడవిలోని పుట్టకొండపై, సముద్రమట్టానికి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ఈ ఆలయం వెలసి ఉంది. కొండకు వెళ్లే మార్గంలో శికాంజనేయ హనుమాన్ ఆలయం ఉంటుంది. మల్లూరు క్షేత్రానికి ఆయనే క్షేత్రపాలకుడని భక్తులు విశ్వసిస్తారు.

కొండ దిగువ నుండి ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 120–150 మెట్లు ఎక్కాలి.
మూలవిరాట్ శ్రీ నరసింహ స్వామి విగ్రహం ఎత్తు సుమారు 10 అడుగులు. ఆలయంలో ఉన్న ద్వజస్తంభం దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయానికి సమీపంలో రాతితో చెక్కిన ఉగ్ర అంజనేయ (Lord Hanuman) స్వామి విగ్రహం కూడా దర్శనమిస్తుంది.
- ఇది కూడా చదవండి : శ్రీ పైడితల్లి అమ్మవారు..యుద్ధాలు వద్దు, శాంతే ముఖ్యం అన్న దేవత కథ | Sri Paidithalli Ammavaru
ఆలయ చరిత్ర | Temple History
నవ నరసింహ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా Malluru Hemachala Lakshmi Narasimha Swamy ఆలయం గుర్తింపు పొందింది. ఈ ఆలయ చరిత్రను పరిశీలిస్తే, ఆరవ శతాబ్దానికి పూర్వమే దేవతలే నరసింహ స్వామిని ప్రతిష్టించారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి సుమారు 4776 సంవత్సరాల చరిత్ర ఉందని భావిస్తారు.
అగస్త్య మహర్షి ఈ కొండకు హేమాచల అని పేరు పెట్టారట. అసురుల రాజు రావణుడు (Ravana) తన సోదరి శూర్పణకకు ఈ ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడని స్థానిక కథనం. ఇదే ప్రాంతంలో శ్రీరాముడు ఖర, దూషణలతో పాటు సుమారు 14,000 మంది రాక్షసులను సంహరించాడని చెబుతారు.
- ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
ఆరవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన దిలీప కులకర్ణి మహారాజు కాలంలో తవ్వకాలు జరుగుతుండగా, స్వామి వారు మహారాజుకు స్వప్నంలో దర్శనమిచ్చి తన విగ్రహాన్ని భూమి లోపల నుండి వెలికి తీయమని సూచించారట. ఆ విధంగా ఆలయ నిర్మాణం జరిగింది.
మానవ శరీరంలా మెత్తగా స్వామి విగ్రహం

ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అత్యంత విశేషమైన అంశం — నరసింహ స్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉండటం. స్వామి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉన్నాయని భక్తులు చెబుతారు. చూపుడువేలితో తాకితే శరీరంలా లోపలికి మృదువుగా నొక్కబడుతుంది.
బొడ్డు నుండి స్రవించే ద్రవం – స్వామివారికి స్వేదం
నరసింహ స్వామి నాభి వద్ద గాయం ఉన్నట్టు చెబుతారు. ఆ ప్రాంతం నుంచి నిత్యం ఒక ద్రవం స్రవిస్తుంటుంది. మనుషుల్లాగే స్వామివారికి చెమట కూడా వస్తుందనే విశ్వాసం ఉంది. అందుకే ఆ ప్రాంతంలో ఎప్పుడూ చందనం ఉంచుతారు.
- ఇది కూడా చదవండి : 51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
ఈ చందనాన్ని ప్రతి శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ చందనం తీసుకున్నవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని పూర్వకాలం నుంచి భక్తుల నమ్మకం.
ఆలయ దర్శన సమయాలు | Darshan Timings
భక్తులు దర్శనం కోసం ఈ సమయాలను పాటించాలి:
- ఉదయం 8:00 నుండి 1:00 వరకు
- మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 5:00 వరకు
సాయంత్రం 5 గంటల తర్వాత దర్శనాన్ని పరిమితం చేయడానికి కారణం — రాత్రి వేళ స్వామి వారు ఆలయ పరిసర అటవీ ప్రాంతంలో సంచరిస్తారనే భక్తుల విశ్వాసం.
జాగ్రత్తలు | Malluru Hemachala Lakshmi Narasimha Swamy
ఈ ఆలయం దట్టమైన అడవిలో, కొండ ప్రాంతంలో ఉండటంతో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. భక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆలయ పరిసరాల్లో ఎక్కువ దూరం వెళ్లకపోవడం మంచిది.
ఆలయ ప్రాంగణంలో హోటల్స్ లేదా వసతి సదుపాయాలు లేవు. భోజనం తీసుకెళ్లడం లేదా మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగే అన్నదానంలో పాల్గొనవచ్చు.
స్వామివారి నిజ రూప దర్శనం చేయాలంటే శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో వెళ్లడం ఉత్తమం.
స్వామి వారి దర్శనం చేసుకోండి
మల్లూరులో జరిగే వేడుకలు | Festivals In Temple
నరసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో, ముఖ్యంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
- ఇది కూడా చూడండి : బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? ఎలా వెళ్లాయి ?కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Borra Caves Travel Guide
స్వామి పాదాల వద్ద చింతామణి జలధార | Chintamani Stream
స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార ప్రవహిస్తుంది. దీనినే చింతామణి జలధార అంటారు. అన్ని కాలాల్లో ఒకేలా ప్రవహించే ఈ నీరు ఔషధ గుణాలు కలిగి ఉందని భక్తుల విశ్వాసం.
ఈ నీరు తాగిన వారికి అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. రుద్రమదేవి ఒకసారి ఈ జలధార నీటిని తాగి ఆరోగ్యం పొందిందని స్థానిక కథనాలు ఉన్నాయి. ఇప్పటికీ భక్తులు ఈ నీటిని తమ బంధువులకు, విదేశాలకు కూడా పంపిస్తుంటారు.
ఆలయ సందర్శనకు ఉత్తమ సమయం | Best Time to Visit
అక్టోబర్ నుండి జూన్ వరకు ఈ ఆలయాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ – మే నెలల్లో జరిగే వార్షిక ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రకృతి సౌందర్యం, అద్భుతమైన విశేషాలు, అపారమైన విశ్వాసంతో నిండిన మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి తరించండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
