మథుర, వృందావన్ లేదా బర్సానా? హోలి కోసం బెస్ట్ ప్లేస్ ఏది? | Mathura Holi Travel
Mathura Holi Travel : కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికి అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మథుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి.
ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మథుర, యమునా నదీ తీరంలో నిదానంగా , ఆగిపోయిన కాలంలా ఉంటుంది. ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మథుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.
ముఖ్యాంశాలు
కృష్ణ జన్మభూమి వైభవం | Shri Krishna Janma Bhumi
మథురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. గాలిలో నడుస్తుంటే ప్రాచీన శిల్పం, మందిర గోపురం, ఇవన్నీ కలగలిసిన మనసులో ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖధ్ నాదం వినిపిస్తుంది.అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది.
ద్వారకాదీశ్ మందిరం (Dwarakadeesh Mandiram) వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్ డివోషనల్ ఆరాను క్రియేట్ చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !
యమునా తీరంలో నిశ్శబ్ద వేదం

విశ్రామ్ ఘాట్ (Vishram Ghat) దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కన్నులకు ఆనందాన్ని,మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం..ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం.
ఇక్కడ నడుస్తుంటే మథుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది.
బ్రజ్ భూమిలో రంగుల ఋతువు | Braj Bhumi
మథురలో హోలి (Mathura Holi) అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది.
బర్సానా (Barsana), వృందావన్ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తాయి. రాధా కృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
సందర్శనీయ స్థలాలు | Places To Visit in Mathura
మథుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ వృందావన్‌లో బాంకే బిహారీ ఆలయం (Banke Bihari Temple), గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది.

గోవర్ధన పరిక్రమ (Govardhan Giri Parikrama) సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్ చేయలేరు.వృందావన్ వీధుల్లో ప్రతి సంధ్యా భజనలు వినిపిస్తాయి.
ఎలా వెళ్లాలి ? | How To Reach Mathura
ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మథురకు సులభంగా చేరుకోవచ్చు. రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం నిదానంగా బ్రజ్ భూమిలో ప్రవేశించిన అనుభూతిని కల్పిస్తుంది.
ఎక్కడ ఉండాలి ? | Accommodation
మథురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్ వరకు అనేక వసతి సదుపాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్సగా బుక్ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్‌లో తక్కువ ధరకే రూమ్స్ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ వంటివి బుక్ చేసుకునే సమయంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం.
ఏం చూడాలి ? | Mathura Holi Travel

మథుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్ మందిరం, విశ్రామ్ ఘాట్, వృందావన్ (Vrindavan ), గోవర్ధన్ వంటి అనేక ప్రదేశాలను కవర్ చేయవచ్చు.
ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్ లిస్ట్ పెట్టుకుని వివిధ ప్రాంతాలను అన్వేషించడం కన్నా… ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్ అవ్వాలి.
ఎందుకంటే మథుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
ఏం తినాలి ? | Food Choices In Mathura
మథుర అనగానే ముందుగా అక్కడి పెడా గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చిపోవద్దు. పెడా, లస్సీ, చాట్ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.
Have said it 1000 times before. Always avoid places where mass gathering is expected. In this country, such places are potential stampede sites and administration can do so much. This is from lathhmar Holi celebrations in UP's Mathura. pic.twitter.com/6CGpfZh5Eb
— Piyush Rai (@Benarasiyaa) February 27, 2026
మథుర హోలి క్రేజ్ ఎక్కడి వరకు చేరింది అంటే…జనాలు ఇలా భారీ సంఖ్యలో చేరి హోలి ఆడేందుకు ఇష్టపడుతున్నారు. కానీ హోలి సమయంలో మథుర గురించి పోస్టు చేస్తున్నప్పుడు అక్కడి రియాలిటీ కూడా షేర్ చేసే బాధ్యత నాపై ఉంది. ఈ సమయంలో వెళ్లకపోవడం మంచిది అని నేను చెప్పలేను కదా…అందుకే ఇది చూసి నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాను…
టూరిజం అంటే ఇదే ఎక్కడికి వెళ్తున్నా అక్కడి వారిలా జీవించడం. అందుకే అంటారుగా రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అని. అలాగే మథురలో ఉన్నప్పుడు మథురవాసిలా ఉండాలి.
ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ “రాధే రాధే” అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా రాధే రాధే అని పలకరించండి.
చేయాల్సిన పనులు | Activities in Vrindavan
మథురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్ వాక్ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్ హ్యాక్.
వీటితో పాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, వృందావన్‌లో సంధ్యా సమయంలో భక్తి గీతాలను వినడం ఇవన్నీ మథుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.
-ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు.కామ్
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
