Medaram Jatara : ఈ సారి ఫిబ్రవరిలో కాదు.. జనవరిలోనే మేడారం జాతర.. ముహూర్తం ముందుకు రావడానికి కారణం ఏంటంటే ?
Medaram Jatara : తెలంగాణలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ జాతర ఈసారి గతంలో కంటే ముందుగానే రాబోతోంది. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జనవరి 28 నుంచి 31, 2026 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అనూహ్య మార్పు వెనుక ఉన్న కారణాలు అమ్మవార్ల ఆగమనం, తిరుగు పయనం వివరాలు, అలాగే అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జాతర షెడ్యూల్
మేడారం జాతరలో ఏ రోజు ఏం జరుగుతుందనేది భక్తులకు చాలా ముఖ్యం. ఈసారి ఖరారైన షెడ్యూల్ ఇలా ఉంది
- జనవరి 28, బుధవారం: సాయంత్రం 6 గంటలకు సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకుంటారు. అదే సమయంలో గోవిందరాజు, పడిగిద్ద రాజు కూడా గద్దెకు వస్తారు. అమ్మవారిని స్వాగతించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
- జనవరి 29, గురువారం: సాయంత్రం 6 గంటలకు సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు. ఈ దృశ్యం కోసం భక్తులు వేల కళ్ళతో ఎదురుచూస్తారు.
- జనవరి 30, శుక్రవారం: ఈ రోజున అమ్మవార్లకు భక్తులు తమ మొక్కులు (వనం) సమర్పించుకుంటారు. కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే ఈ రోజున మేడారం మొత్తం భక్తుల కోలాహలంతో నిండిపోతుంది.
- జనవరి 31, శనివారం: సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు, గోవిందరాజు, పడిగిద్ద రాజు తిరిగి అడవిలోకి ప్రవేశిస్తారు. దీనితో నాలుగు రోజుల జాతర ముగుస్తుంది.
ఇది కూడా చదవండి : Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
ఈసారి జాతర ముందుగా ఎందుకు?
సాధారణంగా మేడారం జాతర తేదీలను పూజారులు ఫిబ్రవరి నెలలో ఖరారు చేస్తుంటారు. అయితే, ఈసారి జాతర సుమారు 20 రోజుల ముందుగానే అంటే జనవరిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం మాఘశుద్ధ పౌర్ణమి రాక. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి ఘడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. 2026లో జనవరి 17న అమ్మవారి ఘడియలు ప్రారంభమై, జనవరి 31న పౌర్ణమి ఉండటంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందే జాతర తేదీలను జనవరి 28 నుంచి 31 వరకు నిర్ణయించారు. కొత్త పున్నమి రాక కారణంగానే ఈసారి జనవరిలోనే నిర్ణయం తీసుకున్నట్లు పూజారులు వివరించారు.

కోటి మంది భక్తుల కోసం అధికారుల సన్నాహాలు
ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు కోటికి పైగా భక్తులు తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈసారి జాతర తేదీలు ముందుగానే ప్రకటించడంతో, అధికారులు ఇప్పుడే జాతర అభివృద్ధి పనులకు సిద్ధమవుతున్నారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అధికారులు శాశ్వత అభివృద్ధి పనులను ముందుగానే పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో మేడారంలో ఇప్పటికే శాశ్వత నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సేవలు, పార్కింగ్, రవాణా సౌకర్యాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, ఆచారాలకు ప్రతీక కాబట్టి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
ఎలా వెళ్లాలంటే
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరుగుతుంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడకు వెళ్లడానికి చాలా మార్గాలున్నాయి.
రోడ్డు మార్గం
మేడారం జాతర సమయంలో టీఎస్ఆర్టీసీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతుంది. హైదరాబాద్ నుండి మేడారం దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి బయలు దేరితే వయా భువనగిరి, ఆలేరు, జనగాం, ఘన్పూర్, వరంగల్,ములుగు రోడ్డు, పస్రా, ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా మేడారం చేరుతాము. వరంగల్ నుండి మేడారం దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ బస్సుల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో మేడారం వెళ్లొచ్చు. కరీంనగర్ నుండి హుజూరాబాద్, పరకాల, ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవచ్చు. విజయవాడ నుండి నందిగామ, ఖమ్మం, ఇల్లందు, పస్రా, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవచ్చు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుండి వచ్చే భక్తులు తమ ప్రాంతాల నుంచి నేరుగా బస్సుల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో రావచ్చు.
రైలు మార్గం
మేడారానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్. ఇది మేడారానికి దాదాపు 95-100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి వరంగల్‌కు రైలు సౌకర్యం ఉంది. జాతర సమయంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్, నిజామాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి వివిధ ప్రాంతాల నుండి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వరంగల్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో లేదా ట్యాక్సీల్లో మేడారం చేరుకోవచ్చు.
విమాన మార్గం
మేడారానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది మేడారం నుండి దాదాపు 240-260 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల నుండి హైదరాబాద్‌కు విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ట్యాక్సీని అద్దెకు తీసుకోవచ్చు లేదా హైదరాబాద్ నుండి వరంగల్ మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆశ్రయించవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.