Ganesha Statue : ఇండియాలో కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన గణేశ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా ?
Ganesha Statue : సాధారణంగా గణేశ విగ్రహాలు, ఆలయాలు అంటే మన దేశంలోనే ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం. కానీ, ప్రపంచంలోనే అతి ఎత్తైన నిలబడిన గణేశ విగ్రహం మన భారతదేశంలో లేదు. అది థాయిలాండ్‌లో ఉంది. ఇది బ్యాంకాక్‌కు తూర్పున ఉన్న చాచోయెంగ్సావో ప్రావిన్స్‌లోని క్లోంగ్ ఖుయెన్ గణేశ్ ఇంటర్నేషనల్ పార్క్‌లో ఉంది. సుమారు 30 మీటర్ల ఎత్తు ఉన్న ఈ విగ్రహం, దాని పీఠంతో కలిపి 39 మీటర్లు (దాదాపు 12 అంతస్తుల భవనం) ఎత్తు ఉంటుంది. అందుకే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిలబడిన గణేశ విగ్రహంగా రికార్డు సృష్టించింది.
854 కాంస్య భాగాలతో నిర్మాణం
ఈ విగ్రహం ఖ్లోంగ్ ఖుయెన్ గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో శాశ్వతంగా ఉంటుంది. దీని నిర్మాణం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ విగ్రహాన్ని 854 కాంస్య భాగాలను కలిపి తయారు చేశారు. ఈ భాగాలు వందల టన్నుల బరువు మోయగల పునాదుల మీద ఏర్పాటు చేయబడ్డాయి. దాదాపు 40,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న ఈ పార్కు థాయిలాండ్‌లోని ప్రసిద్ధ పార్కులలో ఒకటి.

ముందుకు అడుగు వేస్తున్న గణనాథుడు
ఈ విగ్రహాన్ని థాయ్ కళాకారులు రూపొందించారు. వారు గణేశుడి విజయాన్ని ప్రసాదించే రూపంలో, అంటే నిలబడిన భంగిమలో దీనిని నిర్మించారు. ఈ విగ్రహం ముందుకు అడుగు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది.. దీనికి పురోగతి అని అర్థం. థాయిలాండ్‌లో గణేశుడిని ఫ్రా ఫికానెట్ లేదా ఫ్రా ఫికానేసువాన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వినాయకుడిని అదృష్టాన్ని ప్రసాదించే దేవుడిగా పూజిస్తారు. ఈ విగ్రహానికి నాలుగు చేతులు ఉన్నాయి. వాటిలో మామిడి, పనస, అరటి, చెరుకు గడ ఉన్నాయి. ఇవి వ్యవసాయం, సమృద్ధికి చిహ్నాలు. ఆయన పాదాల వద్ద మోదకం పట్టుకున్న ఎలుకను కూడా చూడవచ్చు.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
పార్కుకు ఎలా చేరుకోవాలి?
ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ గణేశ విగ్రహాన్ని చూడాలని ప్లాన్ చేసుకుంటే.. మీరు బ్యాంకాక్ నుండి చచోయెంగ్సావోకు రైలు టికెట్ బుక్ చేసుకోవాలి. బ్యాంకాక్‌లోని హువా లాంఫాంగ్ రైల్వే స్టేషన్ నుండి చచోయెంగ్సావో జంక్షన్‌కు చేరుకోవడానికి సుమారు 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది. అక్కడి నుండి స్థానిక టాక్సీలు లేదా టుక్-టుక్లను సులభంగా పొందవచ్చు. ఇది బ్యాంకాక్ నుండి ఒక రోజులో లేదా అర రోజులో చూసి రాగల ప్రయాణం. బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కమాయి, మో చిట్ బస్ స్టేషన్ల నుండి కూడా బస్సులు ఉన్నాయి. అవి సుమారు 1.5 గంటల సమయం తీసుకుంటాయి. సొంత కారులో వెళ్తే 1.5–2 గంటలు పడుతుంది. సందర్శన సమయాలు: ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
చచోయెంగ్సావోను గణేశ దేశం అని పిలవడంలో తప్పు లేదు. ఇక్కడ మరో రెండు పెద్ద గణేశ విగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వాట్ సమాన్ రత్తానారం ఆలయంలో ఉన్న పడుకుని ఉన్న గణేశ విగ్రహం (సుమారు 16 మీటర్ల ఎత్తు, 22 మీటర్ల పొడవు). మరొకటి వాట్ ఫ్రాంగ్ ఆకట్ వద్ద ఉన్న కూర్చున్న గణేశ విగ్రహం (సుమారు 49 మీటర్ల ఎత్తు). ఈ విగ్రహాలు థాయ్ ప్రజలకు గణేశుడి పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. మీరు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఈ అందమైన పార్కును సందర్శించడం మర్చిపోవద్దు. ఈ ప్రదేశం భక్తులకు, యాత్రికులకు ఒక మధురానుభూతిని ఇస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.