Hormuz Island : వంటల్లో మసాలాలకు బదులు మట్టిని వాడే వింత ద్వీపం ఎక్కడుందో తెలుసా ?
Hormuz Island : సాధారణంగా వంటల్లో ఉప్పు, కారం, పసుపు వాడతాం. కానీ మట్టిని మసాలాగా వాడే ప్రాంతం కూడా ఉంది.. ఏంటి నమ్మలేకపోతున్నారా? అవును, ఇది నిజం. ఇరాన్ తీరంలో ఉన్న ఒక ద్వీపంలో స్థానికులు మట్టిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. అద్భుతమైన రంగులు, అంతులేని అందాలతో నిండిన ఈ ద్వీపం గురించి, అక్కడి మట్టి కథ గురించి వివరంగా తెలుసుకుందాం. పర్యాటకులకు ఆనందాన్ని పంచే దీవులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. కానీ మీరు తినగలిగే మట్టి ఉన్న ఒక ద్వీపం గురించి ఎప్పుడైనా విన్నారా? అవును, ఇక్కడ మట్టిని బ్రెడ్‌లో సాస్‌గా, కూరల్లో మసాలాగా ఉపయోగిస్తారు.
ఇరాన్ తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ మధ్యలో కన్నీటి బొట్టు ఆకారంలో ఉన్న ఒక ద్వీపం ఉంది. దీని పేరు హోర్ముజ్ ద్వీపం. అగ్నిపర్వత శిలలు, మట్టి, ఇనుముతో నిండిన ఈ ద్వీపం పసుపు, ఎరుపు, నీలం వంటి అనేక రంగులతో ఇంద్రధనస్సులా మెరుస్తుంది. అందుకే స్థానికులు దీనిని రెయిన్బో ఐలాండ్ అని పిలుస్తారు.

మొత్తం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో పరిశోధకులు 70కి పైగా ఖనిజాలను గుర్తించారు. కోట్ల సంవత్సరాల క్రితం పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉప్పు నిక్షేపాలు పేరుకుపోయి, అగ్నిపర్వత అవశేషాలతో కలిసి రంగుల దిబ్బలుగా మారాయని శాస్త్రవేత్తలు తేల్చారు. అక్కడి భౌగోళిక పరిస్థితులే ఈ రంగుల దిబ్బలు, ఎర్రటి బీచ్‌లు, అందమైన ఉప్పు గుహలకు కారణమని వారు నిర్ధారించారు. కాలక్రమేణా, భూమిలోకి కిలోమీటర్ల లోతుకు పాతుకుపోయిన ఈ దిబ్బల నుండి తేలికపాటి ఉప్పు పొరలు బయటపడి, గోపురాల వలె కనిపిస్తూ పర్యాటకులను మరింత ఆకర్షిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఇక్కడ దొరికే గెలక్ అనే ఎర్రటి మట్టిని స్థానిక వంటకాల్లో ఉపయోగిస్తారు. అగ్నిపర్వత శిలల నుండి ఉద్భవించిన హెమటైట్ కారణంగా ఇది ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ మట్టి నుండి సురాఖ్ అనే సాస్ కూడా తయారు చేస్తారు. దీనిని బ్రెడ్‌తో తింటే అద్భుతమైన రుచి ఉంటుందని చెబుతారు. అయితే, ఈ మట్టిని వంటల్లో మాత్రమే కాకుండా, సౌందర్య సాధనాలలో, డిజైన్లలో కూడా ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
ఈ ద్వీపానికి నైరుతి దిశలో బహుళ రంగులతో మెరిసే ఒక లోయ ఉంది. దీనిని రెయిన్బో వ్యాలీ అని పిలుస్తారు. ద్వీపం మొత్తం రంగులతో మెరిసినప్పటికీ, ఈ లోయ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. సూర్యరశ్మిలో ఈ అందాలను చూడాలని పర్యాటకులు చెబుతారు. ఆ లోయ పక్కనే మరో లోయ ఉంది.. శిల్పులు చెక్కినట్లుగా అనేక వింత ఆకారాలు కనిపిస్తాయి. అయితే, అవి మానవులచే చెక్కబడలేదని నమ్మడం కష్టం. వాలీ ఆఫ్ స్టాట్యూస్ గా ప్రసిద్ధి చెందిన ఈ లోయలో.. పక్షులు, డ్రాగన్ల వంటి వింత రూపాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి. ఇవన్నీ వేల సంవత్సరాలుగా ప్రకృతి కోతకు గురై ఏర్పడిన అద్భుతాలు. ద్వీపానికి పశ్చిమాన ఒక కిలోమీటర్ దూరం విస్తరించి ఉన్న ఈ లోయలోని ఉప్పు స్ఫటికాలకు ఔషధ గుణాలు ఉన్నాయని, అవి ప్రతికూల శక్తిని దూరం చేసే ఉప్పు దైవమని స్థానికులు నమ్ముతారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.