Ramayana Yatra: రామాయణ యాత్ర.. మహా సముద్రంలో నీటి బొట్టంత లంకలో రాముడి అద్భుతాలు
Ramayana Yatra: హిందూ మహాసముద్రంలో ఒక నీటి బొట్టులా కనిపించే శ్రీలంక దీవి, వధువు నుదుటన మెరిసే పచ్చల పాపిడి బొట్టులా ఉంటుంది. ఈ చిన్న దేశంలోనే రామాయణానికి సంబంధించిన అనేక చారిత్రక, పౌరాణిక ప్రదేశాలు ఉన్నాయి. రాముడు కట్టిన శివాలయం, సీతమ్మ అగ్నిపరీక్ష సాక్షి దివురుంపోలా, దంబుల్లా గుహలు, సిగిరియా కోట, హనుమంతుడి విగ్రహాలు వంటి అద్భుతాలను దర్శించుకోవడానికి వీలుగా ఆరు రోజుల శ్రీలంక రామాయణ యాత్ర (హైదరాబాద్ ఎక్స్) ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ కోడ్ SHO10 కాగా యాత్ర అక్టోబర్ 24న ప్రారంభమవుతుంది.
6 రోజుల యాత్ర ప్రణాళిక
1వ రోజు: కొలంబో, మునీశ్వరం, రామలింగేశ్వర ఆలయం
ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్ట్ చేసి, మధ్యాహ్నం 1:30కి విమానం (UL178) ద్వారా కొలంబో చేరుకుంటారు. అక్కడ నుంచి చిలాలోని మునీశ్వర ఆలయం దర్శనం ఉంటుంది. రావణ సంహారం తర్వాత రాముడు ఇక్కడ శివుడిని ప్రార్థించినట్లు, నాలుగు శివలింగాలను ప్రతిష్టించమని శివుడు కోరినట్లు కథనం. దీని పక్కనే రాముడు స్వయంగా నిర్మించిన మనవేరి (రామలింగం) ఆలయం ఉంది. రాత్రి దంబుల్లాలో బస చేస్తారు.
2వ రోజు: దంబుల్లా గుహలు, సిగిరియా కోట, క్యాండీ
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత దంబుల్లా కేవ్ టెంపుల్, సిగిరియా కోట సందర్శిస్తారు. దంబుల్లా గుహలు పూర్వపు రాజు వత్తగామిని అభయకు ఆశ్రయం ఇచ్చాయి. సిగిరియా దుర్గం (కశ్యపుని రాజప్రసాదం) నిటారుగా ఉన్న కొండపై నిర్మించిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మధ్యాహ్నం భోజనం తర్వాత క్యాండీకి ప్రయాణం. అక్కడ రాయల్ బొటానికల్ గార్డెన్స్ వీక్షించి, సాయంత్రం శ్రీలంక సంస్కృతిని తెలిపే కల్చరల్ షో చూసి, రాత్రి క్యాండీలో బస చేస్తారు.
ఇది కూడా చదవండి : Ramappa Temple : రామప్ప ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు
3వ రోజు: బుద్ధ దంత ధాతు ఆలయం, అశోకవాటిక
ఉదయం క్యాండీలోని బుద్ధుడి దంతావశిష్ట ఆలయం (టూత్ రిలిక్ టెంపుల్) దర్శిస్తారు. ఇది ప్రపంచ బౌద్ధానికి ఒక కేంద్రం. తర్వాత రంబోదా చేరుకుని, భక్త హనుమాన్ టెంపుల్ చూస్తారు. సీతాన్వేషణలో అలసిపోయిన హనుమంతుడు ఇక్కడ విశ్రమించాడని నమ్మకం. ఇక్కడి హనుమంతుడి విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది. దారిలో టీ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. ఆ తర్వాత నువారా ఎలియా సమీపంలో సీతాదేవిని ఉంచిన అశోకవాటిక (సీతా ఎలియా) చూసి, రాత్రికి నువారా ఎలియాలో బస చేస్తారు. ఇక్కడి సీతా అమ్మన్ ఆలయం దక్షిణ భారత శైలిలో ఉంటుంది.
4వ రోజు: అగ్నిపరీక్ష సాక్షి దివురుంపోలా, కతరగామ
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నువారా ఎలియాలోని బ్రిటిష్ జ్ఞాపకాలు, గ్రెగరీ లేక్ విహారం చూస్తారు. దివురుంపోలా అంటే ఒట్టు వేసిన ప్రదేశం అని అర్థం. సీతాదేవి అగ్నిపరీక్ష జరిగింది ఇక్కడే అని చెబుతారు. ఇక్కడ రాముడు, సీత, హనుమంతుడి విగ్రహాలు పూజలందుకుంటాయి. తర్వాత గాయత్రీ పీఠం సందర్శనం ఉంటుంది. సాయంత్రం కుమారస్వామి-వల్లీ దేవిని కలిసిన ప్రదేశంగా చెప్పే కతరగామ టెంపుల్ దర్శించి, రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !
5వ రోజు: విభీషణుడి పట్టాభిషేకం, పంచముఖ ఆంజనేయ
కతరగామ నుంచి కొలంబోకు ప్రయాణం. కేలనియా మహా విహారాయ (కెలాని నదీ తీరాన)లో రావణుడి సోదరుడు విభీషణుడి పట్టాభిషేకం జరిగినట్లు స్థల పురాణం. ఇక్కడ విభీషణుడి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయం బౌద్ధ కళాకృతులకు ప్రతీక. ఆ తర్వాత పంచముఖ ఆంజనేయ టెంపుల్ (ఆంజనేయుడికి రథం ఉన్న ఏకైక ఆలయం) దర్శిస్తారు. సాయంత్రం కొలంబో సిటీ టూర్, గాలే ఫేస్ బీచ్‌ను చూసి, రాత్రి కొలంబోలో బస చేస్తారు.
6వ రోజు: హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి ఎయిర్‌పోర్టుకు వెళతారు. ఉదయం 7:25 గంటలకు కొలంబో నుంచి విమానం (UL177) బయలుదేరి 9:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ఒక్క వ్యక్తికి అయ్యే ఖర్చును పరిశీలిస్తే, సింగిల్ షేరింగ్ ఎంపిక అత్యంత ఖరీదైనదిగా ఉంది, దీని ధర దాదాపు రూ.90,000. ఒకవేళ మీరు ఇద్దరు కలిసి ప్రయాణించి డబుల్ షేరింగ్ ఎంచుకుంటే, ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గి దాదాపు రూ.65,000 అవుతుంది. ఇక ముగ్గురు కలిసి ఒకే రూమ్‌ను పంచుకుంటూ ట్రిపుల్ షేరింగ్ ఎంచుకుంటే, ఒక్కొక్కరి ధర మరింత తగ్గి దాదాపు రూ.64,000 అవుతుంది. దీనిని బట్టి, ఎక్కువ మంది కలిసి షేర్ చేసుకుంటే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని స్పష్టమవుతోంది.
ప్యాకేజీలో ఇవి లేవు: ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రవాణా ఖర్చులు, లాండ్రీ, మద్యం, మెనూలో లేని ఆహారం, డ్రైవర్/గైడ్లకు టిప్‌లు.
కావాల్సిన డాక్యుమెంట్లు: ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్, పాన్ కార్డు కలర్ సాఫ్ట్‌కాపీ.
సంప్రదించాల్సిన చిరునామా: ఐఆర్సీటీసీ జోనల్ ఆఫీస్, 9–1–129 /1 /302, ఆక్స్ఫర్డ్ ప్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్. ఫోన్: 040– 27702407.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.