Kudavelli Temple : తెలంగాణలో రామాయణంతో ముడిపడిన పురాతన ఆలయం.. ఈ క్షేత్రం ప్రత్యేకతలేంటి?
Kudavelli Temple : భారతదేశం ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక సంఘటనలకు పుట్టినిల్లు. త్రేతాయుగంలో శ్రీరాముడు పరిపాలించిన ఈ పుణ్యభూమిలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కుడావెల్లి ఆలయం. ప్రతేడాది మాఘమాసంలో ఇక్కడ గొప్ప జాతర జరుగుతుంది.
శ్రీరాముడు స్వయంగా ఇసుకతో చేసి ప్రతిష్ఠించిన శివలింగం ఈ ఆలయ ప్రత్యేకత. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఈ ఆలయం ఎక్కడుంది ?
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, భూంపల్లి మండలం, దుబ్బాక సమీపంలోని రామేశ్వరంపల్లి గ్రామంలో ఈ ఇసుక లింగం ఆలయం ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్ని రాష్ట్ర ప్రజలు దక్షిణ కాశీగా భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఈ ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంత చరిత్ర విషయానికి వస్తే, రావణుడిని సంహరించిన తర్వాత, బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి శ్రీరాముడు శివుడిని పూజించాలని అగస్త్య మహర్షి సలహా ఇస్తారు.
దీంతో శ్రీరాముడు శివలింగాన్ని కాశీ నుండి తీసుకురావాలని హనుమంతుడిని కోరతాడు. అయితే, హనుమంతుడు రావడానికి ఆలస్యం కావడంతో, శ్రీరాముడు స్వయంగా ఇసుకతో ఒక లింగాన్ని చేసి పూజించిన కథ మనందరికీ తెలిసిందే.

శ్రీరాముడు కుడావెల్లి వాగు వద్ద ఇసుకతో చేసిన సైకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుండగా, అప్పుడే హనుమంతుడు కాశీ నుండి శివలింగాన్ని తీసుకువస్తాడు. అక్కడ ఇప్పటికే ఒక లింగం ఉండటం చూసి మారుతి చింతిస్తుండగా, శ్రీరాముడు చింతించకు హనుమా నువ్వు తెచ్చిన లింగాన్ని ముందు పూజించు, తర్వాత నేను ప్రతిష్ఠించిన సైకత లింగాన్ని పూజించు అని వాయుపుత్రునికి వరం ఇస్తాడు.
ఈ ఆలయంలో రెండు లింగాలను మనం చూడవచ్చు. ఇది ఈ ఆలయానికి రామాయణంతో ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేస్తుంది.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఈ ఆలయం రెండు వాగుల సంగమ ప్రదేశంలో నిర్మించబడింది. సాధారణంగా అన్ని వాగులు పడమర నుండి తూర్పు వైపు ప్రవహిస్తాయి. అయితే, కుడావెల్లి క్షేత్రంలో మాత్రం వాగు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది.
ఇది ఇక్కడి మరో విశేషం. కుడావెల్లి క్షేత్రంలో పార్వతి సంగమేశ్వర ఆలయం, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, వినాయక ఆలయం వంటి అనేక దేవాలయాలను సందర్శించవచ్చు. ఇది ఒకే చోట అనేక దేవతా విగ్రహాలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ప్రత్యేక కార్యక్రమాలు
ప్రతేడాది మాఘమాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు, తీర్థయాత్రలు చేస్తారు.
ఎలా చేరుకోవాలి ?
ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుండి సిద్దిపేట చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి రామాయంపేట మీదుగా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఈ క్షేత్రం హైదరాబాద్ నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది. సిద్దిపేట నుండి ఆర్టీసీ బస్సులలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వెళ్లాలనుకునే వారికి రోడ్డు మార్గం సులభంగా ఉంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.