TTD : భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి సంవత్సరం శ్రీవారి భక్తుల కోసం అందించే 2026వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీల విక్రయాన్ని ప్రారంభించింది. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే ఈ క్యాలెండర్లు, డైరీలలో శ్రీవారి వైభవం, ముఖ్యమైన పండుగలు, పర్వదినాల వివరాలు స్పష్టంగా ముద్రించి ఉంటాయి. భక్తులు సులభంగా వీటిని కొనుగోలు చేయడానికి వీలుగా, టీటీడీ ఆఫ్‌లైన్ కేంద్రాలతో పాటు, ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు సౌకర్యాన్ని కల్పించింది.
విక్రయానికి అందుబాటులో ఉన్న ఉత్పత్తులు
టీటీడీ 2026 సంవత్సరానికి గాను పలు రకాల క్యాలెండర్లు, డైరీలను అందుబాటులో ఉంచింది. వీటిలో ప్రధానంగా 12-పేజీల క్యాలెండర్లు (నెలకో పేజీ చొప్పున శ్రీవారి చిత్రాలతో), 6-పేజీల క్యాలెండర్లు (రెండు నెలలకు ఒక పేజీ చొప్పున పెద్ద సైజువి), డెస్క్ లేదా టేబుల్‌పై పెట్టుకునేందుకు వీలుగా ఉండే టేబుల్ టాప్ క్యాలెండర్లు ఉన్నాయి. డైరీల విషయానికి వస్తే, ముఖ్య సమాచారంతో కూడిన డీలక్స్ డైరీలు (పెద్ద సైజు), సులువుగా వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉండే చిన్న డైరీలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి, శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక పెద్ద సైజు క్యాలెండర్లు, స్వామి, అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్లు కూడా భక్తుల అభిరుచికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఆఫ్‌లైన్ కొనుగోలు కేంద్రాలు
ఈ క్యాలెండర్లు, డైరీలను భక్తులు సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా టీటీడీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సేల్స్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుమల, తిరుపతిలలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం దగ్గర, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాలలో; తిరుచానూరులోని పబ్లికేషన్ స్టాల్స్‌లలో; రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులలోని టీటీడీ కళ్యాణమండపాలలో; విజయవాడ, విశాఖపట్నం లోని టీటీడీ కార్యాలయాల్లో లభిస్తాయి. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్ లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణలో కూడా అందుబాటులో ఉంచారు. ఇతర రాష్ట్రాలైన చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలు, ఆలయాల్లో కూడా ఈ ఉత్పత్తులు లభిస్తాయి.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం
దూర ప్రాంతాలలో ఉండే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లైన (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ద్వారా తమకు కావలసిన క్యాలెండర్లు, డైరీలను ఆర్డర్ చేయవచ్చు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి, గతంలో మాదిరిగానే పోస్టల్ శాఖ సహకారంతో టీటీడీ డైరీలు, క్యాలెండర్లను వారి ఇంటి వద్దకే చేర్చే సౌకర్యం కొనసాగుతోంది.
సాధారణంగా నూతన సంవత్సరం ప్రారంభానికి ముందే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు భారీ డిమాండ్ ఉంటుంది. కాబట్టి, భక్తులు ఎటువంటి ఆలస్యం లేకుండా, తమకు కావలసిన ఉత్పత్తులను వీలైనంత త్వరగా ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
