Travel Tip 03 : జూలై నెలలో టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రాంతాలకు వెళ్తే బెటర్
Travel Tip 03 : మా తాత చిన్నప్పుడు చెప్పేవాడు…వర్షం పడుతుంటే బయటకు వెళ్లకురా… అని నేను వినేవాడిని కాదు. కొన్నిసార్లు బురద అంటుకునేది, కొన్ని సార్లు పూర్తిగా తడిచిపోయేవాడిని…తాత మాట వింటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది.
తాత మాట విన్నట్టు నటించేవాడే మనవడు…ఏమంటారు ?
నిజానికి జూలై నెలలో దేశ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు (Monsoon In India In July) పడుతుంటాయి. ఇలాంటి టైమ్‌లో మా తాతనే కాదు ఎవరైనా టూర్లకు వెళ్లొద్దనే చెబుతారు. అయినా కూడా మీకు వెళ్లాలని ఉంటే… మీ కోసం అంతో ఇంతో బెటర్ అయిన డెస్టినేషన్స్ సెలెక్ట్ చేసి ఒక లిస్టు రెడీ చేశాను.
ఈ సీజన్లో మరీ ముఖ్యంగా జూలై రెండో వారం నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు దేశంలో వరుణుడి రాజ్యం నడుస్తుంది. అందుకే ఎక్కడికి వెళ్లాలో చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎక్కడికి వెళ్లకూడదో (Places Not to Visit in Monsoon) ఒక ఆర్టికల్‌లో పోస్ట్ చేశాను.
- అది కూడా చదవండి :Travel Tip 02 : జూలైలో వెళ్లకూడని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే
ఇక ఎక్కడికి వెళ్లాలో చూద్దాం…
1. ఉదయ్‌పుర్ | Rajasthan
ఎండాకాలం రాజస్థాన్ వెళ్లిన వాడు మొనగాడు. ఎండాకాలం తరువాత వెళ్లిన వాడు ప్రయాణికుడు. చలికాలం వెళ్లిన వాడు తెలివైన వాడు అనే డైలాగ్ఎప్పుడైనా రాజస్థాన్‌లో వ్లాగ్ చేస్తే అందులో వాడుకుంటాను.

వర్షాకాలంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ (Udaipur) చాలా అందంగా అప్పుడే వాటర్ వాష్ చేసుకుని బయటికి వచ్చిన బండిలా ఉంటుంది. ముసురుగా పడే వర్షాలు ఎడారి ఓడలను (Rajasthan Camels) కూడా నెమలిలా నాట్యం చేసేలా చేస్తాయి.
ఇక ఈ ప్రాంతాల్లో ఉన్న చెరువులు, సరస్సులు వర్షంలో సరమాడుతున్నట్టు సారీ తడుస్తూ చాలా అందంగా కనిపిస్తాయి. ఒక వేళ మీరు కూడా ఈ టైమ్‌లో వెళ్లాలని ప్లాన్ చేస్తోంటే అక్కడి సిటీ ప్యాలెస్సు (City Palace), పిచోలా సరస్సు (Pichola Lake), మాన్సూన్ ప్యాలెస్సు ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
2. లెహ్ లడఖ్ | Travel Tip 03
ప్రతీ ప్రయాణికుడి కల ఇది. గోవా తరువాత ప్రతీ భారతీయుడి ఫేవరిట్ డెస్టినేషన్ ఏంటంటే ముందు లెహ్ – లడఖ్ (Leh- Ladakh) అని చెబుతారు. ఈ సమయంలో అంటే వర్షాకాలంలో కూడా ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది.
ఆకాశం చాలా క్లియర్‌గా, దూరపు కొండలు చాలా దగ్గరిగా , వర్ణించలేనంత అందంగా, దారులు చాలా పొడువుగా, వాటర్ ట్యాంకర్ నుంచి నీరు జారినప్పుడు ఆ తడికి తారు రోడ్డు రంగులా, అద్భుతంగా ఉంటుంది ఈ ఏరియా. మీరు బైక్‌పై వెళ్లడానికి ప్లాన్ చేస్తే ఇంకా బెటర్ (Ladakh On Bike).

మరీ ముఖ్యంగా నుబ్రా వాలీ (Nubra Valley), ప్యాంగ్యాంగ్ లేక్ (pangong lake), మేగ్నెటిక్ హిల్స్ (Magnetic Field), శాంతి స్థూప (Shanti Stupa), లే కోట ( Leh Palace), ఇండస్ -జాంస్కర్ నదులు సంగమం ( Confluence of Indus-Zankar) , థిక్సీ మోనాస్టరీ, సో మోరిర్ లేక్ వంటి ప్రాంతాలు మీ మనసు దోచుకుంటాయి.
పర్వతాలకు అలవాటు పడండి | Acclimatization
పర్వత ప్రాంతాలకు వెళ్లినప్పడు మీ శరీరం ఆ ప్రాంతానికి తగినట్టు అడ్జస్ట్ అవ్వడానికి సమయం పడుతుంది. దీనినే, ఈ అలవాటు పడే విధానాన్నె ఎక్లిమటైజ్ (Acclimatize) అంటారు. మీరు డైరక్టుగా ఎత్తైన పాస్‌లకు వెళ్లకుండా ముందు ఈ ప్రాంతానికి అలవాటు పడండి.
3. వరంగల్ , ములుగు జిల్లాలు | Telangana

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని వరంగల్, ములుగు జిల్లాలు (Mulugu District) ఈ సీజన్లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. వర్షాపాతం సాధారణంగా ఉన్నప్పుడు మీరు ఈ జిల్లాల్లోని చారిత్రాత్మక ప్రదేశాలు, ఆలయాలు, చెరువులను సందర్శించవచ్చు.
కాకతీయల (Kakatiya Dynasty) ఖ్యాతిని తెలిపే అనేక కట్టటాలను మీరు ఇక్కడ చూడవచ్చు. వరంగల్ వెళ్లే వేయి స్థంభాల గుడి (Thousand Pillar Temple), వరంగల్ కోటను (Warangal Fort) అస్సలు మిస్ అవ్వకండి.
లక్నవరం సరస్సు | Laknavarm Lake : ఇక ములుగు జిల్లాకు వెళ్తే లక్నవరం సరస్సు, సరస్సు మధ్యలో ద్వీపాల్లో రిసార్టులు మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Laknavaram : లక్నవరంలో మూడవ ద్వీపం..ఎలా ఉందో చూడండి

రామప్ప దేవాలయం | Ramappa Temple : తెలంగాణలో ఉన్న ఏకైకా యూనెస్కో హెరిటేజ్ సైట్ (UNESCO World Heritage Site) అయిన రామప్ప దేవాలయాన్ని మీరు తప్పకుండా సందర్శించాల్సిందే.
- ఇది కూడా చదవండి : Ramappa : రామప్ప ఆలయం వీకెండ్ ప్యాకేజీ తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం శాఖ
Travel Tip 03 : ఈ ఆలయం శిల్పకళా వైభవం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. రామప్ప ఆలయంలో ఉన్న రాతి శిలలు, వాటిని చెక్కిన సాంకేతికత మిమ్మల్ని తప్పకుండా వావ్ అనేలా చేస్తుంది. పైగా భూకంపాన్ని తట్టుకునే విధంగా శాండ్ బాక్స్ సాంకేతికతో (Sandbox Technology) ఈ ఆలయం పునాదులను వేశారు. ఈ సాంకేతికతను అయోధ్యలోని బాల రాముడి (Ayodhya Temple) ఆలయ నిర్మాణానికి కూడా వినియోగించారు.
రామప్ప చెరువు | Ramappa Lake : ఎండాకాలంలో కూడా నీటిని అందించే విధంగా చెరువును నిర్మించారు. చాలా విశాలంగా అందంగా ఉంటుంది. రామప్ప ఆలయం పక్కనే ఉన్న ఈ చెరువులో మీరు బోటింగ్ కూడా చేయవచ్చు.
4. అరకు లోయ | Andhra Pradesh
నేను ఇతర రాష్ట్రాలకు ట్రావెల్ చేేసే టైమ్‌లో చాలా మంది మీ తెలుగు రాష్ట్రాల్లో మంచి డెస్టినేషన్స్ పేర్లు ఏంటని అడుతుంటారు. సౌత్‌కు వస్తే ఏఏం చూపిస్తావు అంటారు. వారికి నేను ముందు అరకు లోయ (Araku Valley) గురించే చెబుతానుఈ ప్రాంతాన్ని టూరిజం సర్కిట్గా జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది.
- వర్షాలు తక్కువగా ఉన్నప్పడు ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది.
- జూలైలో వెళ్లవచ్చు. అయితే వెళ్లే ముందు వర్షాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- ఇక చలికాలం అయితే అరకు అందం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు అనుకుంటా.
బొర్రా కేవ్స్ | Borra Caves : మిలియన్ల సంవత్సరాల ముందు ఏర్పడిన బొర్రా గుహలు ఎంత విశాలంగా ఉంటాయో అంతే అందంగా ఉంటాయి. అరకు వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.
- ఇది కూడా చదవండి : Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
లంబసింగి | Lambasigi : దీనిని ఆంధ్రా కాశ్మీరం అని కూడా పిలుస్తారు. చాలా మంది ఇక్కడ స్నో పడుతుంది అనుకుంటారు. నిజానికి స్నో పడదు కానీ అంత చల్లగా ఉంటుంది. చాలా అందంగా కూడా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
వంజంగి | Vanjangi : దక్షిణాదిలో మంచి సీనిక్ వ్యూస్ ఉన్న కొండల్లో వంజంగి కూడా ఒకటి. వంజంగి కొండ ఎక్కి అక్కడి నుంచి సూర్యోదయం చూస్తే వచ్చే కిక్కే వేరు.
వీటితో పాటు మీరు కటకి జలపాతం, కాఫీ మ్యూజియం వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. త్వరలో అరకు సిరీస్ చేస్తున్నాను. ఆ వీడియోలు ప్రయాణికుడు ఛానెల్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి.
5. పాండిచ్చెరి | Tamil Nādu
దక్షిణాదిలో ఎన్నో బీచులు ఉన్నా అందులో పాండి బీచ్‌కు (Pondicherry) ఉన్న ప్రత్యేకత వేరు. మీరు బీచు పక్క నుంచి వెళ్తుంటే సముద్రం మీ కోసమే మేకప్ వేసుకుని అందంగా ముస్తాబైనట్టు ఉంటుంది. జూలై నెలలో వర్షాలు సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు చెక్ చేసుకుని వెళ్లండి.
- పాండిచ్చెరి వెళ్తే ప్రొమనేడ్ బీచు, ఆరోవిల్లే, వైట్ టౌన్ కేఫులను చూడండి.
- అలాగే బీచులో కూర్చొని సరదగా సముద్రంలో వర్షం పడటాన్ని చూడండి.
- ప్రతీ నీటి చుక్కను కౌగిలితో స్వీకరించే సముద్రాన్ని చూస్తే, సముద్రమే చుక్క చుక్క నీటి కోసం వేచి చూస్తుంది…మనం ఎందుకు ప్రతీ అవకాశాన్ని అలా చేతులు చాచి అందిపుచ్చుకోమని.
06. మౌంట్ అబు | Rajasthan
రాజస్థాన్ అంటే ఎడారి మాత్రమే గుర్తొస్తుంది కదా. కానీ ఇక్కడ అందమైన మౌంట్ అబు (Mount Abu) ఉంటుంది. ఇది రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ కాబట్టి దీన్ని వాళ్లు బంగారంలా చూసుకుంటారు. చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడ పడితే వర్షం పడొచ్చేమో కానీ వరదలు మాత్రం రావని అంటారు.

- మౌంట్ అబు వెళ్తే దిల్వారా ఆలయం, సూర్యాస్తమయంతో పాటు నక్కి సరస్సును కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
- వర్షాకాలంలో రాజస్థాన్ నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా పర్యాటకులు వెళ్తుంటారు.
- క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ముందే చాలా పక్కగా ప్లాన్ చేసుకోండి. మళ్లీ జాగ్రత్తలు చెప్పలేదు అని అంటారేమో.
07. జైపూర్ | Rajasthan
పేరుకే పూర్ కానీ జైపూర్ (Jaipur) చాలా రిచ్ ప్లేస్ (డబ్బుల పరంగా తెలియదు కానీ కల్చర్ పరంగా అయితే రిచ్) . ఇక్కడ వారసత్వ కట్టడాలు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక క్షేత్రాలు మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి. నిత్యం దుమ్మూ ధూళితో పర్యాటకులను అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే జైపూర్ వర్షాకాలంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది.

జైపూర్‌లో అంబర్ కోట (Amber Fort), హవా మహల్ ( Hawa Mahal), సిటీ ప్యాలెస్ (City Palace), నైగర్, జైగర్ కోటలు వంటి అనేక ప్రాంతాలను మీరు కవర్ చేయవచ్చు. హవా మహల్ అయితే చాలా విచిత్రంగా ఫిలింసిటిలో భారీ సెట్టింగ్లా ఉంటుంది.
08. పచమారి | Madhya Pradesh
మధ్య ప్రదేశ్‌లో ఉన్న అందమైన టూరిస్టు డెస్టినేషన్స్‌లో పచమారి ( Pachmarhi) కూడా ఒకటి. భారత దేశంలో మధ్య భాగంలో ఉన్న ఈ అందమైన స్వర్గంలాంటి రాష్ట్రంలో మీకు ఎన్నో నేచురల్ డెస్టినేషన్స్ లభిస్తాయి. అందులో పచమారి అయితే మరీ అందంగా ఉంటుంది. పైగా చాలా తక్కువ మంది టూరిస్టులు ఉండటంతో మీరు అక్కడి తెలిమంచులోంచి జలజల జారుతున్న జలపాతాలను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇక్కడికి వెళ్తే మీరు బీ ఫాల్స్ (Bee Falls), గుప్త మహాదేవ్ గుహ, ధూప్ గర్, రజత్ ప్రాపత్ (Rajat Prapat)ఫాల్స్, బడా మహాదేవ్ గుహ, పాండవ గుహలు, ఎన్నో జలపాతాలు చూడవచ్చు.
అయితే ఇక్కడికి వెళ్లే ముందు లోకల్స్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకోండి. వాస్కోడా గామా (Vasco Da Gama) ఆల్రెడీ ఇండియాను కనుక్కున్నాడు కాబట్టి మళ్లీ మనం కనుక్కునే అవసరం లేదు. జస్ట్ అవసరమైన సమాచారం కనుక్కుని, మీ డౌట్స్ క్లారిటీ చేసుకుని ఒక క్లారిటీ తెచ్చుకని వెళ్లండి. ఇక్కడికే కాదు ఎక్కడికైనా తెలుసుకునే వెళ్లండి.
09 వాలీ ఆఫ్ ఫ్లవర్స్ | Valley Of Flowers
ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రాంతాన్నినేను దేవ కన్యలు ఆటలాడే స్థలం అని అంటాను. 2024 లో నేను ఈ పువ్వుల లోయకు వెళ్లాను. స్థానిక ట్రెక్కర్స్ , గైడ్‌తో మాట్లాడితే వాళ్లు చెప్పింది ఏంటంటే ఇక్కడికి దేవ కన్యలు విహారానికి వస్తారని, సరదాగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారట.

దీంతో పాటు ఆంజనేయుడు సంజీవని పర్వతం కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి కూడా వచ్చారట.
ఈ ప్రాంతాన్ని చూసిన పాండవులు ఇక్కడి అందానికి మంత్ర ముగ్ధులయ్యారంటే నమ్మండి. నిజానికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో జూలై, ఆగస్టు నెలలోనే నిండా పువ్వులు కనిపిస్తాయి. అయితే ఇదే సమయంలో ఛమోలీ జిల్లాల్లో (Chamoli District) విపరీతమైన వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగి పడటం జరుగుతుంటాయి.

అందుకే నేను సెప్టెంబర్‌లో వెళ్లాను. వెళ్లి వీడియో కూడా చేశాను. యూనెస్కో హెరిటేజ్ సైట్ (UNESCO) అయిన ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు మీరు వెళ్లాలి అనుకుంటే వీలైనంత ఎక్కువగా అక్కడి వాతావరణం గురించి తెలుసుకోండి. అండ్ మరింత సమాచారం కావాలంటే ఈ వీడియో చూడండి.
Watch Now :
ఇంకో విషయం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేరుకునేందుకు మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ అంటే కొంచెం ముందు నుంచే ప్రిపేర్ అయితే బెస్ట్.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించ పూర్తి సమాచారం తెలుసుకోండి :
- ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
10. మహబలిపురం | Tamil Nadu
ఒకవైపు సముద్రం మరో వైపు అద్భుతం. మొత్తానికి మహాబలిపురం (Mahabalipuram) అనేది మహాద్భుతమైన ప్రదేవం. సన్నని చినుకులు పడుతున్నప్పుడు ఇక్కడి వారసత్వ కట్టడాలు మరింత అందంగా కనిపిస్తాయి. ఇక్కడి రాతి శిల్పాలను చూసి మిమ్మల్ని మీరు మర్చిపోతారు.

గమనిక : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ , పచమారీ, అరకు లోయ, వరంగల్, ములుగు జిల్లాలకు వెళ్లే ముందు మీరు అక్కడి వాతావణం గురించి తప్పకుండా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.
- ఎందుకంటే వర్షాకాలం ఎప్పుడో చెప్పగలం కానీ వర్షం ఎప్పుడొస్తుందో చెప్పలేము కదా.
- మీకు కొన్ని ప్రాంతాలు సూచించాను. వాటి గురించి పూర్తిగా రీసెర్చ్ చేయాల్సింది, ఒక నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మీరే.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.