Singaperumal Temple : భార్యభర్తల మధ్య గొడవలా.. తులసి దళాలతో ఈ ఆలయంలో పూజిస్తే పోతాయట
Singaperumal Temple : హిందూ సంప్రదాయంలో దేవుళ్ళ పూజకు అనేక నియమాలు ఉన్నాయి. పూజా విధానం, ఉపయోగించే ద్రవ్యాలు, పువ్వులు, ధరించే దుస్తుల వరకు ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. సాధారణంగా శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా, శివుడికి బిల్వ పత్రాలు అత్యంత ప్రియమైనవిగా భావిస్తారు. శివుడి పూజలో తులసి, మొగలి పువ్వు, కుంకుమ వంటి కొన్ని పదార్థాలు వాడటం నిషేధం అనే నియమం ఉంది. అయితే, భారతదేశంలో ఒకే ఒక్క ఆలయం ఉంది. అక్కడ శివుడిని తులసి దళాలతో పూజించే అరుదైన ఆచారం ఉంది. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలని కోరుకునే భక్తులు ఈ ఆలయంలో ప్రత్యేకంగా తులసితో పూజలు చేస్తారు.
తులసితో శివ పూజ చేసే ఆలయం
ఆ వింత శివాలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. చెన్నై సమీపంలోని వల్లకోట్టై రోడ్డులోని కోలత్తూర్ గ్రామంలో కొలువైన ఆ ఆలయమే సింగపెరుమాళ్ ఆలయం (అసలు పేరు తులసీశ్వర ఆలయం). సాధారణంగా శాస్త్రాల ప్రకారం శివ పూజలో తులసిని ఉపయోగించకపోయినా, ఈ ఆలయంలో మాత్రం తులసితో పూజ చేస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి, సామరస్యం నెలకొనడానికి, మరియు జాతకంలో చంద్రుడి బలం పెరగడానికి భక్తులు ఇక్కడ తులసి దళాలతో స్వామిని పూజిస్తారు. ఈ ఆలయంలో శివలింగం 5 అడుగుల పొడవు ఉంటుంది.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
ఆలయ పురాణ గాథ
తులసీశ్వరర ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. కైలాసంలో శివపార్వతుల వివాహం జరిగే సమయంలో, దేవతలు, ఋషులు ఉత్తర భూభాగంలో సమావేశమయ్యారు. వారి శక్తి కారణంగా భూమి సమతుల్యత కోల్పోయింది. అప్పుడు శివుడు అగస్త్య మహర్షిని పిలిచి, భూమిని సమం చేయడానికి దక్షిణ దిశగా వెళ్లమని ఆదేశించాడు. అగస్త్యుడు దక్షిణం వైపు వచ్చి, అక్కడ 108 శివలింగాలను ప్రతిష్టించి భక్తితో పూజించాడు. ఆ 108 శివలింగాలలో ఈ తులసీశ్వర ఆలయంలోని లింగం కూడా ఒకటి. అగస్త్యుడు శివుడిని పూజించడానికి ఒక చెరువును కూడా నిర్మించి, పౌర్ణమి రోజున తులసి దళాలతో శివుడిని పూజించాడు.
అర్ధనారీశ్వర రూపంలో శివుడు
అగస్త్యుడి భక్తికి సంతోషించిన శివపార్వతులు ఆయనకు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చారు. అప్పటి నుంచి స్వామివారు అక్కడే తులసీశ్వరుడుగా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈ పవిత్ర ఆలయంలో శివుడు అర్ధనారీశ్వర లింగ రూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయానికి ఉన్న మరో అరుదైన విశేషం. ఈ లింగం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ, ఈశాన్య మూల వైపు కొద్దిగా తిరిగి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయాన్ని 900 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా భావిస్తున్నారు మరియు ఇది విక్రమ చోళుల కాలంలో నిర్మించబడిందని చెబుతారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఆలయ ప్రవేశ సమయాలు
ఈ ఆలయం రోజువారీగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. సెలవులు, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ రోజుల్లో ఆలయం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది. విల్వవన నాయకి సమేత తులసీశ్వరర ఆలయంతో పాటు, ఈ పట్టణంలోనే ఉన్న అముధవల్లి తాయర్ సమేత తిరునారాయణ పెరుమాళ్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.