తిరుమలలో మినీ వైకుంఠాన్ని తలపించిన గరుడ సేవ .. | Garuda Vahana Seva
Garuda Vahana Seva : గరుడ వాహన సేవ, తిరుమల గరుడ సేవ, తిరుమల బ్రహ్మోత్సవాలు, మోహినీ అవతారం, మలయప్ప స్వామి, తిరుమలలో 3 లక్షల మంది భక్తులు..
కలియుగ వైకుంఠం తిరుమలలో శనివారం రాత్రి అద్భుతం జరిగింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి భూలోకమే తరలివచ్చినట్టు అనిపించింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. దాదాపు 3 లక్షల మంది భక్తుల సమక్షంలో తిరుమల పులకించిపోయింది.
ఉదయం మోహినీ అవతారంతో మైమరపించి…
గరుడ సేవ రాత్రి అయినా, భక్తుల పండుగ ఉదయమే మొదలైంది. బ్రహ్మోత్సవాల 5వ రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. ఒక పల్లకీపై జగన్మోహిని రూపంలో స్వామివారు, మరో పల్లకీపై శ్రీకృష్ణుడు… ఈ అపురూప దృశ్యాన్ని చూసి తరించారు భక్తులు.
కానీ అసలు కథ అక్కడే మొదలైంది. గరుడ సేవలో ముందు వరుసలో కూర్చోవాలనే తపనతో భక్తులు ఉదయం మోహినీ అవతారం కంటే ముందే గ్యాలరీలను ఆక్రమించేశారు. చేతిలో చిన్న పిల్లలు, వృద్ధులతో సహా కుటుంబాలకు కుటుంబాలు దాదాపు 12 గంటల పాటు ఎండనక, ఆకలిని లెక్కచేయక అక్కడే వేచి ఉన్నారు. అది భక్తి కాదు, ఒక తపస్సు.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారికి రోజూ 45 రకాల నైవేద్యాలు.. పేర్లు వింటే ఆశ్చర్యపోతారు | Tirumala Naivedyam
భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు
భక్తుల ఈ నిరీక్షణను గమనించిన టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా గ్యాలరీల్లో తిరుగుతూ పర్యవేక్షించారు.
Prayanikudu Ground Report: గ్యాలరీల్లో కూర్చున్న ప్రతి భక్తుడికి అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ నిరంతరం అందుతూనే ఉంది. దాదాపు 4,000 మంది శ్రీవారి సేవా వాలంటీర్లు పరుగులు పెడుతూ సేవ చేశారు. భక్తులు టాయిలెట్స్ కోసం ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది నిజంగా అభినందనీయం.
సాయంత్రం 6.30 – ఆ క్షణం వచ్చేసింది!
సాయంత్రం 6.30 కాగానే వాహన మండపం తలుపులు తెరుచుకున్నాయి. పురాతనమైన లక్ష్మీ కాసుల హారం, మకర కంఠి, సహస్రనామ మాల, ఆండాళ్ మాలలతో ధగధగ మెరుస్తున్న మలయప్ప స్వామి తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై బయటకు వచ్చారు.
- ఇది కూడా చదవండి : 1000 ఏళ్ల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవం ఎలా జరిగేదో తెలుసా? శాసనాల్లో బయటపడ్డ అసలు నిజం
ఆ క్షణం… మాటల్లో చెప్పలేం. లక్షల గొంతులు ఒక్కసారిగా “గోవిందా… గోవిందా” అంటూ చేసిన జయజయధ్వానాలతో తిరుమల కొండలు దద్దరిల్లాయి. చాలా మంది భక్తుల కళ్ళల్లో ఆనందభాష్పాలు. టీటీడీ అధికారులు గరుడ వాహనాన్ని గ్యాలరీలకు దగ్గరగా తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ స్వామిని తనివితీరా దర్శించుకున్నారు.
పోలీసు, విజిలెన్స్ పరంగా తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా సేవ సజావుగా ముగిసింది.
▶️ వీడియో చూడండి : కర్మాన్ఘాట్ ఆంజనేయుడి మహత్యం
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
