Terracotta Army : 2,000 ఏళ్లుగా భూగర్భంలో దాగి ఉన్న చైనా సైన్యం!
Terracotta Army : 2,200 ఏళ్ల క్రితం కిన్ షి హువాంగ్ చక్రవర్తి కోసం నిర్మించిన 8,000 మట్టి సైనికుల అద్భుతం. షియాన్ లోని ఈ యునెస్కో వారసత్వ ప్రదేశానికి హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలి, టికెట్లు, ఫుడ్ పూర్తి గైడ్.
చైనాలోని పురాతన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుతమైన నిర్మాణాలే టెర్రకోట ఆర్మీ. వేలాది మంది సైనికులు, గుర్రాలు, రథాల ప్రతిమలతో కూడిన ఈ భారీ సముదాయం చైనాలోని షాన్షీ ప్రావిన్స్లో, షియాన్ నగరానికి సమీపంలో ఉంది.
మట్టితో తయారు చేసిన ఈ సైనిక ప్రతిమలను సుమారు 2,200 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రతి ప్రతిమ ముఖ కవళికలు, కేశాలంకరణ, దుస్తులు భిన్నంగా కనిపించడం ఈ ప్రదేశం ప్రత్యేకత.
- ఇది కూడా చదవండి : వియత్నాం ట్రిప్లో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే
చక్రవర్తి సమాధిని కాపాడేందుకు…| Story Behind Terracotta Army
చైనాలో తొలి చక్రవర్తిగా పేరొందిన కిన్ షి హువాంగ్ (Qin Shi Huang) సమాధి సముదాయంలో భాగంగా టెర్రకోట ఆర్మీని నిర్మించారు. క్రీ.పూ. మూడో శతాబ్దంలో ప్రారంభమైన ఈ నిర్మాణం, మరణానంతర జీవితంలోనూ తనకు సైన్యం రక్షణగా ఉండాలనే చక్రవర్తి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని చరిత్రకారులు భావిస్తారు.
1974లో స్థానిక రైతులు ఒక బావి కోసం నేలను తవ్వుతున్న సమయంలో ఈ ప్రతిమల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ తర్వాత జరిగిన పురావస్తు తవ్వకాలలో వేలాది సైనికులు, గుర్రాలు, రథాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆవిష్కరణ ప్రపంచ పురావస్తు చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది.
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి చైనాలోని షియాన్కు విమానంలో వెళ్లేందుకు సాధారణంగా మరో నగరంలో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాల్సి ఉంటుంది. షియాన్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరానికి మెట్రో, ట్యాక్సీ వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
- ఇది కూడా చదవండి : Japan Travel : జపాన్లో తప్పక చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు ..ఒకసారి వెళ్తే మర్చిపోలేరు!
ఈ నగరం నుంచి టెర్రకోట ఆర్మీ మ్యూజియం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెట్రో లైన్ 9లో హువాచింగ్ పూల్ స్టేషన్ చేరుకుని, అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా వెళ్లవచ్చు. టెర్రాకోట ఆర్మీని చూసేందుకు ఒక రోజు పూర్తిగా డెడికేట్ చేయండి.
షియాన్లో చూడదగిన ఇతర ప్రదేశాలు
- షియాన్ సిటీ వాల్: పురాతన నగర రక్షణ గోడపై నడవవచ్చు, సైకిల్ నడుపుతూ సిటీ టూర్ చేయవచ్చు.
- బిగ్ వైల్డ్ గూస్ పగోడా: చైనా బౌద్ధ చరిత్రకు సంబంధించిన ప్రసిద్ధ కట్టడం.
- ముస్లిం క్వార్టర్: స్థానిక వీధి ఆహారం, మార్కెట్లు, చారిత్రాత్మక వీధులకు ప్రసిద్ధిచెందింది.
- హువాచింగ్ ప్యాలెస్: చైనా చరిత్రతో ముడిపడిన రాజభవన సముదాయం.
ఏం తినాలి?
షియాన్లో బియాంగ్బియాంగ్ నూడుల్స్, రౌజియామో అనే చైనీస్ బ్రెడ్ శాండ్విచ్, యాంగ్రో పావోమో అనే రొట్టె ముక్కలతో చేసే సూప్ ప్రసిద్ధి. మాంసాహారం తిననివారు వెజిటేరియన్ రెస్టారెంట్లను ముందుగానే గుర్తించుకోవడం మంచిది.
ప్రయాణానికి ముందు
వసంతకాలం, శరదృతువులో వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. టెర్రకోట ఆర్మీ ప్రవేశ టికెట్లను ముందుగానే బుక్ చేసుకుని, పాస్పోర్ట్ వెంట తీసుకెళ్లాలి. చైనాకు వెళ్లే ముందు వీసా నిబంధనలు, చెల్లింపుల యాప్లు, ఇంటర్నెట్ సదుపాయాలను కూడా పరిశీలించాలి.
చరిత్రను పుస్తకాల్లో చదవడం వేరు…దానిని ప్రత్యక్షంగా చూడటం వేరు. వేలాది మట్టి సైనికుల మధ్య నిలబడి నాటి చైనా సామ్రాట్ కథను తెలుసుకోవడం ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది.
ఇది చదవండి : థాయ్లాండ్ ట్రావెల్ గైడ్
