Kailash Mansarovar Yatra 2025: కైలాస మానస సరోవర్ యాత్ర 2025.. ఎంత ఖర్చవుతుంది? ఎలా వెళ్లాలి?
Kailash Mansarovar Yatra 2025: పవిత్రమైన కైలాస మానస సరోవర్ యాత్ర హిందువులు, బౌద్ధులు, జైనులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక ప్రయాణం. మహాశివుని నివాసంగా భావించే కైలాస పర్వతం (Mount Kailash), సృష్టికి మూలమని నమ్మే మానస సరోవరం (Mansarovar Lake) దర్శనం చాలామందికి ఒక జీవితకాల కల. కరోనా మహమ్మారి కారణంగా అలాగే కొన్ని దౌత్యపరమైన కారణాల వల్ల దాదాపు ఐదేళ్లు ఆగిన ఈ యాత్ర, జూన్ 2025 లో తిరిగి ప్రారంభమైంది. చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో జరిగే ఈ పురాతన తీర్థయాత్రను ప్రతి సంవత్సరం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిర్వహిస్తుంది.

ఈ యాత్ర సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య జరుగుతుంది. ఈ ప్రయాణంలో ట్రెక్కింగ్ (నడక), రోడ్డు మార్గాలు రెండూ ఉంటాయి. కైలాస యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ముందుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. లక్షలాది దరఖాస్తులు వస్తుండటంతో, యాత్రికుల ఎంపిక కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రా (Lottery) ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎంపికైన వారికి మాత్రమే యాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది. భారత ప్రభుత్వం యాత్రికుల కోసం ప్రధానంగా రెండు మార్గాలను ఏర్పాటు చేసింది, వీటిని బట్టే ఖర్చు మరియు ప్రయాణ సమయం ఆధారపడి ఉంటుంది.
లిపులేఖ్ పాస్ (ఉత్తరాఖండ్) మార్గం: ఇది దాదాపు 23 – 25 రోజులు పడుతుంది. ఈ మార్గంలో ఎక్కువ దూరం ట్రెక్కింగ్ (నడక) చేయాల్సి ఉంటుంది. అందుకే దీనికి శారీరక దృఢత్వం చాలా అవసరం. ఈ మార్గం ద్వారా యాత్రకు వెళ్లడానికి ఒక్కొక్కరికి సుమారు రూ.1.74 లక్షల నుంచి రూ.2.10 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
నాథు లా పాస్ (సిక్కిం) మార్గం: ఈ మార్గంలో దాదాపు 21 రోజులు పడుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ తక్కువగా ఉంటుంది, ప్రయాణం ఎక్కువగా బస్సులో రోడ్డు మార్గంలో సాగుతుంది. ఈ మార్గం కొంత ఖరీదైనది; ఒక్కొక్కరికి సుమారు రూ.2.20 లక్షల నుంచి రూ.2.83 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.
పై రెండు మార్గాలతో పాటు, ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా నేపాల్ మీదుగా హెలికాప్టర్ ద్వారా కూడా యాత్రకు వెళ్లవచ్చు. ఈ మార్గంలో తక్కువ రోజుల్లో (సుమారు 9 నుంచి 14 రోజులు) యాత్ర పూర్తవుతుంది. అయితే, దీని ఖర్చు రూ.2.50 లక్షలకు పైగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ద్వారా జరిగే ఈ యాత్రకు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని కఠినమైన అర్హతలు పాటించాలి. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ యాత్ర అధిక ఎత్తులో, కఠినమైన వాతావరణంలో జరుగుతుంది కాబట్టి, యాత్రికులు శారీరకంగా దృఢంగా ఉండాలి. అందుకే దరఖాస్తుదారుడి బాడీ మాస్ ఇండెక్స్(BMI) 25 లేదా అంతకంటే తక్కువ ఉండేలా చూస్తారు. దరఖాస్తు సమయంలో పాస్పోర్ట్ సైజు ఫోటో (JPG, 300 KB లోపు), పాస్పోర్ట్ స్కాన్ కాపీ (PDF, 500 KB లోపు) సిద్ధంగా ఉంచుకోవాలి. ఎంపికైన యాత్రికులకు మాత్రమే ఫీజు చెల్లించమని మెసేజ్ లేదా మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
