Kukke Subrahmanya Temple: సర్పదోష పూజలు పొగేట్టే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి.. ఎక్కడ వెలిశాడో తెలుసా ?
Kukke Subrahmanya Temple: కర్ణాటకలోని పశ్చిమ కనుమల అటవీ ప్రాంతంలో, దట్టమైన పచ్చని వాతావరణం మధ్య ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. అదే దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలూకాలో ఉన్న కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ప్రకృతి అందాల నడుమ ప్రశాంతతను అందించే ఒక పుణ్యక్షేత్రం. ముఖ్యంగా సర్ప దోషాలు, నాగశాపాలు, వివాహ, సంతాన సమస్యలు ఉన్నవారికి ఈ ఆలయం ఒక వరంగా నిలుస్తుంది. గరుడి నుంచి రక్షణ కోరుతూ ఇక్కడికి వచ్చిన నాగరాలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అభయమిచ్చాడు కాబట్టే, ఈ క్షేత్రం నాగదోషాలను తొలగించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది.
ఆలయ చరిత్ర, దాని విశిష్టత
పురాణాల ప్రకారం.. గరుత్మంతుడి భయంతో నాగర రాజు వాసుకి, ఇతర పాములు సుబ్రహ్మణ్య స్వామిని శరణు కోరడానికి ఇక్కడికి వచ్చాయి. అప్పుడు స్వామి వాసుకికి తన అభయహస్తం ఇచ్చి రక్షించాడు. అందుకే ఈ స్థలాన్ని సర్పాలకు ఆశ్రయం ఇచ్చే పవిత్ర స్థలంగా భావిస్తారు. అలాగే, తారకాసుర, సూరపద్మాసుర వంటి రాక్షసులను సంహరించిన తర్వాత, సుబ్రహ్మణ్య స్వామి తన సోదరుడు గణేశుడితో కలిసి కుమార పర్వతానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడు స్వామిని ఆహ్వానించి, తన కుమార్తె దేవసేనను ఇచ్చి వివాహం జరిపించాడు. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున కుమారధార నది ఒడ్డున ఈ పెళ్లి జరిగినట్లు చెబుతారు. అప్పటినుంచీ స్వామి సుబ్రహ్మణ్య దేవసేనతో కలిసి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాముఖ్యతను ఆది శంకరాచార్యులవారు తన సుబ్రహ్మణ్య భుజంగప్రయాత స్తోత్రంలో భజే కుక్కే లింగం అని ప్రస్తావించారు. ఇది ఈ ఆలయం ప్రాచీనతను, గొప్పతనాన్ని సూచిస్తుంది.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
సర్పదోష నివారణ పూజలు
కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం ముఖ్యంగా సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధి. వాటిలో ముఖ్యమైనవి:
ఆశ్లేష బలి పూజ: ఆశ్లేష నక్షత్రం రోజున చేసే ఈ పూజను సర్పదోషాలను తొలగించడానికి అత్యంత ముఖ్యమైన, ప్రభావవంతమైన పూజగా భావిస్తారు. ఈ పూజ చేయడం వల్ల కాలసర్ప దోషం, నవగ్రహ దోషాలు, నాగశాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహం, ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయని చెబుతారు.
సర్ప సంస్కార పూజ: ఇది సర్పదోష నివారణ కోసం చేసే మరో ప్రధాన పూజ. ఈ పూజ చేయించుకునేవారు రెండు రోజుల పాటు ఆలయంలోనే ఉండాలి. పూజ తర్వాత పుట్టమన్నును ప్రసాదంగా ఇస్తారు. ఇది వారి దోషాలను పోగొడుతుందని నమ్ముతారు.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
ఆలయ నిర్మాణం – గరుడ స్తంభం ప్రత్యేకత
ఆలయంలోని గర్భగుడికి, ప్రధాన ద్వారానికి మధ్య వెండితో తాపడం చేసిన ఒక గరుడ స్తంభం ఉంటుంది. గర్భగుడిలో ఉండే నాగాధిపతి వాసుకి వెదజల్లే విషవాయువుల నుంచి భక్తులను రక్షించడానికి ఈ స్తంభాన్ని ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతుంది. భక్తులు కుమారధార నదిలో స్నానం చేసి, ఆలయం వెనుక వైపు నుంచి ప్రవేశించి ప్రదక్షిణ చేస్తారు. గర్భగుడిలోని పీఠం పైన సుబ్రహ్మణ్య స్వామి, వాసుకి విగ్రహాలు, కింద శేషనాగు విగ్రహం ఉంటాయి. ఒకే చోట ఈ మూడు విగ్రహాలను దర్శించుకోవడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. సర్పదోషాలు, వివాహ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే తప్పకుండా ఉపశమనం పొందుతారని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఈ క్షేత్రాన్ని దర్శించాలనుకునేవారు బెంగళూరు నుంచి రైలు లేదా బస్సు మార్గాల్లో సులభంగా చేరుకోవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.