Natta Rameshwaram : ఏడాదికి ఒక్క నెల మాత్రమే కనిపించే శివయ్య గుడి.. పశ్చిమ గోదావరిలో అద్భుతం
Natta Rameshwaram : ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఒక్క నెల మాత్రమే దర్శనమిచ్చే గుడి మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంత్ర మండలం, నటరామేశ్వరంలోని ప్రత్యేక శివాలయంలో జరిగే అద్భుతం ఇది. శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు నమ్ముతారు. త్రేతాయుగం నాటి పురాతన కథలతో ముడిపడిన ఈ ఆలయం, వైశాఖ మాసంలో మాత్రమే భక్తుల దర్శనార్థం తెరచుకుంటుంది. ఈ అద్భుతమైన ప్రదేశం గురించి వివరంగా తెలుసుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రశాంత వాతావరణంలో ఒక శివాలయం ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన పూజా సంప్రదాయాలను కలిగి ఉంది. ఈ గుడి ఏడాదిలో 11 నెలలు నీటిలో మునిగి ఉంటుంది. గుడి గోపురం మాత్రమే నీటిపైన కనిపిస్తుంది. అలా అని ఈ గుడి నది మధ్యలో లేదు.. ఒడ్డున ఉంది. అయినా సరే దీనిని నీటితో నింపి ఉంచుతారు. వైశాఖ మాసంలో మాత్రమే నీటిని తీసేసి, భక్తులకు శివయ్య దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. స్థానికుల నమ్మకం ప్రకారం 11 నెలలు గుడిని నీటిలో ఉంచకపోతే ముఖ్యంగా శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు తప్పవట.

ఈ అసాధారణ సంప్రదాయం ఇప్పుడిప్పుడే మొదలైనది కాదు. ఇది త్రేతాయుగానికి ముందు నుంచీ వస్తుంది. కథల ప్రకారం.. తల్లిని చంపిన శాపం నుంచి బయటపడటానికి పరశురాముడు ఓంకార నాదం వినిపించిన ప్రతిచోటా శివలింగాన్ని ప్రతిష్టించాలని బయలుదేరాడు. క్రౌంచ పర్వతాన్ని ఛేదించుకుంటూ, శివలింగాన్ని మోసుకుంటూ గోస్తాన నదికి చేరుకున్నాడు. అక్కడ నదీతీరంలో ఋషులు తపస్సులో ఉన్నారు. ఓంకార నాదం అక్కడ వినిపించడంతో పరశురాముడు ఆ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఈ పవిత్ర కార్యక్రమంలో ఏడు కోట్ల బ్రహ్మ దేవతలు పాల్గొన్నందున, ఈ శివలింగాన్ని సప్తకోటి రామేశ్వర లింగం అని పిలుస్తారు.
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
అయితే, పరశురాముడు లింగాన్ని ప్రతిష్టించినప్పుడు అదే సమయంలో అక్కడ పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విపత్తులను నివారించడానికి, బ్రహ్మ దేవతలు ఆ గుడిని ఏడాదిలో 11 నెలలు నీటిలో ఉంచాలని, వైశాఖ మాసంలో మాత్రమే దర్శనానికి అనుమతించాలని సూచించారు. వారి ఆదేశాల ప్రకారం ఈ సంప్రదాయం అప్పటి నుంచీ కొనసాగుతోంది. ఇది ఈ పురాతన ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తుగా మారింది.
ఈ ఆలయంలో మరో ముఖ్యమైన శివలింగం కూడా ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతతో కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, నత్తగుల్లలు, ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి ప్రతిష్టించాడని పురాణం చెబుతుంది. అందుకే ఈ ప్రదేశానికి నటరామేశ్వరం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా, లక్ష్మణుడు ప్రతిష్టించిన మరో శివలింగం కూడా ఇక్కడ ఉండటం వల్ల భక్తులు ఈ ప్రదేశాన్ని త్రిలింగ క్షేత్రంగా కొలుస్తారు.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
వైశాఖం రాగానే ఆలయ అధికారులు గుడిలోని నీటిని పూర్తిగా తీసివేసి, భక్తులకు శివయ్య దర్శనాన్ని కల్పిస్తున్నారు. నటరామేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంత్ర మండలంలో ఒక గ్రామం. ఏలూరు పశ్చిమ గోదావరిలోని ఒక ప్రధాన నగరం. రోడ్డు మార్గం ఇక్కడకి ఈజీగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి సుమారు 120-130 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు లేదా భీమవరం వరకు బస్సు లేదా రైలులో వెళ్లి, ఆపై స్థానిక రవాణా ద్వారా చేరుకోవచ్చు.
సమీప ప్రధాన రైల్వే స్టేషన్లు భీమవరం టౌన్, ఏలూరు. ఈ రైల్వే స్టేషన్ల నుండి నటరామేశ్వరానికి స్థానిక బస్సు లేదా టాక్సీని తీసుకోవచ్చు. విమానం ద్వారా వెళ్లాలంటే దగ్గర్లో రాజమండ్రి ఎయిర్ పోర్టు ఉంటుంది. సుమారు 70-80 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి, మీరు నేరుగా నటరామేశ్వరానికి టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు లేదా ఏలూరు/భీమవరంకు బస్సులో వెళ్లి, ఆపై స్థానికంగా ప్రయాణించవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.