Khammam : ఖమ్మం వస్తున్నారా? అయితే ఈ నాలుగు ప్రదేశాలను చూడకుండా వెళ్లొద్దు
Khammam : తెలంగాణ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఖమ్మంకు ప్రత్యేక స్థానం ఉంది. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం, చారిత్రక కట్టడాలతో పాటు, మనసుకు ఆహ్లాదాన్ని పంచే అనేక పర్యాటక స్థలాలకు నెలవు. ఆధ్యాత్మిక, చారిత్రక, ఆధునిక పర్యాటక ప్రదేశాలతో అలరారుతున్న ఖమ్మం నగరంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు (Places To Visit in Khammam) ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శ్రీ హనుమద్గిరి స్థంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఈ స్థంభాద్రి దేవాలయానికి (Sri Stambadri Lakshmi Narasimha Swamy Temple) చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించడానికి స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహ స్వామి, తర్వాత ఖమ్మం పట్టణంలోని ఒక కొండ గుహలో వెలిశారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అందుకే ఈ కొండకు స్థంభాద్రి అనే పేరు వచ్చింది.
ఈ ఆలయంపై చెక్కబడిన కాకతీయుల శైలి శిల్పకళ చూపరులను ఆకట్టుకుంటుంది. రాతితో చెక్కబడిన ఏకశిలా ధ్వజస్తంభం ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ. స్వామివారు దక్షిణ ముఖంగా (దక్షిణం వైపు) దర్శనమివ్వడం ఈ ఆలయ విశిష్టత. గర్భగుడిలో స్వామివారి ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు అద్దాల మండపం ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులోని నీరు సంవత్సరం పొడవునా (365 రోజులు) ఒకే స్థాయిలో ఉండటం ఇక్కడి అద్భుతమైన ప్రత్యేకత.

చారిత్రక ఖమ్మం ఖిల్లా (కోట) | Khammam Fort
ఖమ్మం పట్టణ చరిత్రలో ఈ కోట (ఖిల్లా)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒకప్పుడు కాకతీయుల రెండో రాజధానిగా పిలవబడింది. ఈ కోటను స్థంభాద్రి అనే పెద్ద శిలపై రాళ్లతో నిర్మించారు. దీని నిర్మాణానికి ఏకంగా 56 ఏళ్లు పట్టింది. ఈ కోట దాదాపు నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ కోటను ఖమ్మంఖిల్లా అని పిలుస్తారు. దీని నిర్మాణంలో హిందూ, ముస్లిం శిల్పకళ ఉట్టిపడుతుంది.
కోట లోపల చిన్న ఆలయాలు, మండపాలు, మసీదు కూడా ఉన్నాయి. వర్షపు నీరు సేకరించడానికి ఇటుకలు, సున్నంతో చేసిన నీటి ట్యాంకులు ఉన్నాయి. ఈ కోట చుట్టూ పది ద్వారాలు ఉన్నాయి. కోట ప్రధాన ద్వారం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి రెండు వైపులా శత్రువుల నుండి రక్షించుకోవడానికి ఉపయోగించిన ఫిరంగులను కూడా చూడవచ్చు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ట్యాంక్ బండ్పై వైర్ బ్రిడ్జి, ఎన్టీఆర్ విగ్రహం | Khammam Tannk Bund and NTR Statue
ఖమ్మం నగరంలో ఆధునిక పర్యాటక కేంద్రాలుగా లకారం ట్యాంక్ బండ్, అక్కడ ఉన్న విగ్రహం ఆకర్షిస్తున్నాయి. ట్యాంక్ బండ్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) భారీ విగ్రహాన్ని (Biggest NTR Statue) ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ ఈ విగ్రహం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఖడ్గాన్ని చేత పట్టుకున్న భంగిమలో ఉన్న ఈ 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం నగరంలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
లకారం ట్యాంక్ బండ్పై వైర్ బ్రిడ్జి
లకారం ట్యాంక్ బండ్పై (Lakaram Tank Bund) నిర్మించిన వైర్ బ్రిడ్జి (Khammam Wire Bridge) నగరవాసులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ సస్పెన్షన్ వైర్ బ్రిడ్జిని ప్రత్యేకంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా, అన్ని సౌకర్యాలతో డిజైన్ చేశారు. ఈ వంతెనను మోసే ప్రధాన వైర్లను సౌత్ కొరియా (South Korea) నుంచి దిగుమతి చేసుకున్నారు. దీని నిర్మాణంలో 58 టన్నుల ఇనుము, తుప్పు పట్టని ఉక్కు, ప్రత్యేక రంగులను ఉపయోగించి అత్యంత పటిష్టంగా నిర్మించారు. ఈ కేబుల్ స్టేడ్ బ్రిడ్జి ఖమ్మంలో ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారింది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
