Orugallu Fort : తెలంగాణలోని ఆ ప్లేసుకు వెళితే ఏకంగా 800ఏళ్లు వెనక్కి వెళ్లొచ్చు.. ఇంతకు ఎక్కడంటే ?
Orugallu Fort : తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన వరంగల్ ప్రాంతాన్ని పూర్వం ఓరుగల్లు అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు అనేక అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. అందులో ప్రధానమైనది, అత్యంత విశిష్టమైనది వరంగల్ కోట. ఈ కోట వరంగల్ జిల్లాలోని ఖిలా వరంగల్ ప్రాంతంలో ఉంది. దీని చరిత్ర ప్రకారం.. ఈ కోట 12వ శతాబ్దంలో నిర్మించబడింది. వరంగల్ కోట కాకతీయ రాజులకు రాజధానిగా ఉండేది. దీని నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ కోటను నిర్మించడం ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి 13వ శతాబ్దంలో ఈ కోట నిర్మాణాన్ని పూర్తిచేసింది.
వరంగల్ కోట నిర్మాణం వెనుక చరిత్ర
ఆ కాలంలో కాకతీయులకు హనుమకొండ రాజధానిగా ఉండేది. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా అరణ్యంలా ఉండేది. ఆ గణపతి దేవుడు కాకతీయ రాజ్య రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్‌కు మార్చి ఈ ప్రాంతంలో కోటను నిర్మించారని వరంగల్ నగరానికి చెందిన పర్యాటక మార్గదర్శి రవి యాదవ్ తెలిపారు. ఈ కోట హనుమకొండ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. గణపతి దేవా తర్వాత కాకతీయ పాలనకు నాయకత్వం వహించిన ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి ఈ కోట నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఆ తర్వాత కాకతీయ రాజుల చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు ఈ కోటను ఆధునీకరించారు. ఈ కోట మధ్యలో సూర్య దేవాలయం, రామాలయం నిర్మించారు. ఈ కోటకు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇలా నాలుగు దిక్కుల కళా తోరణాలను ఏర్పాటు చేశారు. ఆ కళా తోరణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి.

కోటలోని మూడు పొరల రక్షణ వ్యవస్థ
ఈ కోట మూడు పొరల కోటను కలిగి ఉంది. ఈ కోటకు మూడు వృత్తాకార గోడలు ఉన్నాయి, అవి ఆ కాలంలో బలమైన రక్షణను సృష్టించాయి. ఇందులో మొదటిది రుద్రమదేవి పాలనలో నిర్మించబడింది. ఈ మట్టి గోడ 2.4 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది. ఈ గోడ చుట్టూ దాదాపు 150 అడుగుల వెడల్పు కందకం ఉంది. ఇది కోట బయటి సరిహద్దులుగా పనిచేసింది. మరొకటి 1.21 కిలోమీటర్ల వ్యాసం కలిగిన రాతి గోడ ఉంది. ఈ గోడను గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ బలమైన రాతి గోడ కోట మధ్య భాగాన్ని రక్షించింది. ఇలా ఈ కోట చుట్టూ రాతికోట, మట్టి కోట, నీటి కోట, పుట్ట కోట, కత్తికోట, కంచుకోట, కంపకోట ఇలా ఏడు కోటలను నిర్మించారు. కానీ ఇప్పుడు అందులో రాతికోట, మట్టికోట మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నిర్మాణం కాకతీయుల కళాఖండానికి మరో చిహ్నాన్ని ప్రదర్శిస్తుంది.
కోట చుట్టూ దేవాలయాలు, బావులు
ఆ కాకతీయ రాజులు ఈ కోట చుట్టూ అనేక దేవాలయాలను నిర్మించారు. నేలశంభుని గుడి, మాండలమ్మ ఆలయం, త్రికుటాలయాలు నిర్మించారు. వీటితో పాటు అనేక బావులను కూడా నిర్మించారు. అక్కాచెల్లెళ్ల బావి, శృంగార బావి, మెట్ల బావి ఇలా విభిన్న బావులను నిర్మించారు. వీటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అవి ఆనాటి నీటి నిర్వహణ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తాయి.
ఇది కూడా చదవండి : Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
దాడులను తట్టుకుని నిలిచిన కోట చరిత్ర
ఈ కోట అనేక దాడులను తట్టుకొని నిలబడింది. 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి పాలనలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి మాలిక్ కాపూర్ ఈ కోటపై దాడి చేశాడు. చాలా నెలల పాటు జరిగిన యుద్ధంలో దాదాపు 10 లక్షలతో కూడిన సైన్యం ఈ కోటపై దాడి చేసింది. ఆ సమయంలో ప్రతాపరుద్రుడి సైన్యం ఈ కోటను అద్భుతంగా రక్షించింది. ఆ తర్వాత చాలా సార్లు ఢిల్లీ సుల్తాన్లు ఈ కోటపై దాడి చేసి ఇందులో ఉన్న దేవాలయాలను నేలమట్టం చేశారు. చివరకు కుతుబ్ షాహీ రాజవంశం ఈ కోటను తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత ఇది హైదరాబాద్ నిజాం పాలనలోకి వచ్చింది. ఈ వరంగల్ కోటకు ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉంది.
ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !
పునరుద్ధరణ పనులు, పర్యాటక ఆకర్షణ
వరంగల్ కోటతో పాటు పురాతన బావులు, పలు దేవాలయాలన్నీ కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. కాకతీయుల కళా సంపదను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఈ కోటతో పాటు బావులను, దేవాలయాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది. ఇప్పటికే అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. కాకతీయుల కళా నైపుణ్యాన్ని తిలకించేందుకు దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ కోటలో ప్రవేశించడానికి ఒక్కరికి 15 రూపాయల ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు. నిత్యం అనేకమంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ కోటలోని అద్భుత కళాఖండాలను చూసి ఆనందిస్తున్నారు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.