Tourist Countries : ఏదైనా సరే హద్దు మీరితే కష్టమే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకరికి కడుపు నిండా తిండి దొరికితే ఇంకొకరికి అతిగా తిన్నందుకు కడుపు నొప్పి వచ్చి ఏడుపొస్తుంది అన్నట్లుగా ఉంది ఆయా దేశాల్లోని పర్యాటకం కథ. చాలా దేశాలు పర్యాటకాన్ని పెంచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే, మరికొన్ని దేశాలు మాత్రం పర్యాటకుల రద్దీని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాయి. వాళ్లకు పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఎంత ముఖ్యమో, తమ సొంత ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరి, అలాంటి దేశాలు ఏంటో గత 2024-25 సంవత్సరాల గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో టాప్ 10 పర్యాటక దేశాలు ఏవో, వాటికి పర్యాటకుల తాకిడి వల్ల వస్తున్న తలనొప్పులేంటో వివరంగా తెలుసుకుందాం.
ఫ్రాన్స్ : పర్యాటకుల డ్రీమ్ ల్యాండ్
ప్రపంచంలోనే అత్యధిక మంది పర్యాటకులు వెళ్ళాలనుకునే దేశం ఫ్రాన్స్. గత సంవత్సరం ఏకంగా 89.4 మిలియన్ల (దాదాపు 8 కోట్ల 94 లక్షల) మంది విదేశీ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించారు. దీనితో ఈ దేశం మొదటి స్థానంలో నిలిచింది. కానీ, ఇంత మంది పర్యాటకులు ఉండటంతో ఫ్రాన్స్‌కు ఇప్పుడు నిజంగానే ఊపిరాడటం లేదట. ప్రపంచ పర్యాటకంలో ఎప్పుడూ టాప్‌లోనే ఉండే ఈ దేశం, అంతకు ముందు సంవత్సరం 2023లో 100 మిలియన్ల (10 కోట్ల) పర్యాటకులతో రికార్డు సృష్టించింది. అయితే, ఆ తర్వాత పర్యాటకుల రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవడం వల్ల సంఖ్య కాస్త తగ్గిందని చెబుతున్నారు.
స్పెయిన్ : ఆరేళ్లుగా రికార్డులే రికార్డులు!
స్పెయిన్ దేశం గత సంవత్సరం 83.7 మిలియన్ల (8 కోట్ల 37 లక్షల) మంది పర్యాటకులతో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడి అద్భుతమైన ఆర్థిక, సాంస్కృతిక ఆకర్షణల వల్ల గత ఆరు సంవత్సరాలుగా ఈ దేశం రికార్డు స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. బీచ్‌లు, చరిత్ర, సంస్కృతి అన్నీ కలగలిపి ఉండటంతో స్పెయిన్‌కు వెళ్లాలని చాలామంది కలలు కంటారు.
అమెరికా : సూపర్ పవర్‌కు కూడా పర్యాటకుల బెడద
ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్ అయిన అమెరికా కూడా పర్యాటకుల రద్దీ సమస్యను ఎదుర్కొంటోంది. గత సంవత్సరం ఈ దేశాన్ని 79.3 మిలియన్ల (7 కోట్ల 93 లక్షల) మంది సందర్శించారు. అయితే, గత ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠినమైన విధానాల వల్ల ఈ సంవత్సరం పర్యాటకుల సంఖ్య ఇప్పటికే తగ్గిందని వార్తలు వస్తున్నాయి.

చైనా : జనంతో నిండిన దేశానికి.. ఇంకో టెన్షన్!
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. ఇప్పుడు పర్యాటకుల తాకిడితో కూడా తల పట్టుకుంటుంది. గత సంవత్సరం ఈ దేశాన్ని 65.7 మిలియన్ల (6 కోట్ల 57 లక్షల) మంది పర్యాటకులు సందర్శించారు. ఇంత మందికి వసతి, సౌకర్యాలు కల్పించాలంటే మామూలు విషయం కాదు కదా!
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఇటలీ : రోమన్ చరిత్ర, వైన్, కళల కాణాచి
రోమన్ సామ్రాజ్యం, అద్భుతమైన వైన్, కళలకు నిలయమైన ఇటలీ, గత సంవత్సరం 64.5 మిలియన్ల (6 కోట్ల 45 లక్షల) మంది పర్యాటకులను ఆకర్షించింది. ఇంత మంది వస్తుండటంతో, ఇప్పుడు టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలు తగ్గించేశారట. తమ దేశ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టర్కీ : ఇస్తాంబుల్, కప్పడోసియా అందాలు
ఇస్తాంబుల్, కప్పడోసియా వంటి అందమైన ప్రదేశాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే టర్కీ, గత సంవత్సరం 51.2 మిలియన్ల (5 కోట్ల 12 లక్షల) మంది పర్యాటకులతో 6వ స్థానంలో నిలిచింది. అయితే, భారతదేశంతో టర్కీ పెట్టుకున్న అనవసరపు పోటీ ఈ సంవత్సరం పర్యాటకుల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపవచ్చని అంటున్నారు.
మెక్సికో : బీచ్‌లు, సంస్కృతి, పురావస్తు ప్రదేశాలు, నోరూరించే వంటకాలు
అందమైన బీచ్‌లు, అద్భుతమైన సంస్కృతి, పురాతన పురావస్తు ప్రదేశాలు, మరియు నోరూరించే రుచికరమైన వంటకాలకు పేరుగాంచిన మెక్సికో, గత సంవత్సరం 45.5 మిలియన్ల (4 కోట్ల 55 లక్షల) మందిని ఆకర్షించింది. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో ఇది కూడా ఒకటి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
జర్మనీ : బీర్ ఫెస్టివల్స్, చారిత్రక నగరాలు
ప్రతి సంవత్సరం బీర్ ఫెస్టివల్స్, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న నగరాలతో అంతర్జాతీయంగా తరచుగా వార్తల్లో ఉండే జర్మనీ, గత సంవత్సరం 39.6 మిలియన్ల (3 కోట్ల 96 లక్షల) పర్యాటకులను పొందింది. ఇక్కడి సాంస్కృతిక కార్యక్రమాలు, పురాతన కట్టడాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి.
2024-25 ప్రపంచ పర్యాటక గణాంకాల ప్రకారం, యూరప్, నార్త్ అమెరికా దేశాలు గ్లోబల్ టూరిజంలో ముందున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. మిగిలిన దేశాల పరిస్థితి ఎలా ఉన్నా… పైన చెప్పిన టాప్ 10 దేశాల్లో, ముఖ్యంగా స్పెయిన్, ఫ్రాన్స్, కొన్ని యూరోపియన్ దేశాలు పర్యాటకుల భారీ రద్దీతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల జీవన వ్యయం, ధరలు పెరుగుతున్నాయి. స్థానిక ప్రజల జీవన నాణ్యతకు ముప్పు వాటిల్లుతోంది. అందుకే, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి స్థానిక ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.