Prometheus Tree : ప్రపంచంలోనే పురాతన చెట్టు.. వయసు తెలుసుకోవడానికి నరికేశారు!
Prometheus Tree : Prometheus Tree: ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్రిసిల్కోన్ పైన్ చెట్టును వయసు కోసం నరికిన విషాదం. వీలర్ పీక్, గ్రేట్ బేసిన్ నేషనల్ పార్క్ చరిత్ర.
ఒక చెట్టు వయసు తెలుసుకోవడానికి ఏం చేస్తారు? దాని కాండం నుంచి చిన్న ముక్క తీసి పరిశీలిస్తారు. కానీ అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో మాత్రం ప్రపంచంలోని అత్యంత పురాతన చెట్లలో ఒకటైన చెట్టును పూర్తిగా నరికేశారు. ఆ తర్వాతే దాని అసలు వయసు బయటపడింది.
అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని వీలర్ పీక్ ప్రాంతంలో పెరిగిన ఈ చెట్టుకు స్థానికంగా ‘ప్రోమీథియస్’ అనే పేరు ఉండేది. ఇది గ్రేట్ బేసిన్ బ్రిసిల్కోన్ పైన్ జాతికి చెందిన చెట్టు. 1964లో భూగోళ శాస్త్ర పరిశోధకుడు డొనాల్డ్ ఆర్. కర్రీ ఈ ప్రాంతంలో ఐస్ ఏజ్ అంటే మంచు యుగంపై పరిశోధన చేసే సమయంలో ప్రోమీథియస్ను గుర్తించాడు.
ఈ చెట్ల కాండంలోని వలయాలు అంటే ట్రీ రింగ్స్ అనేవి గతంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఆ చెట్టు వయసును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.
- ఇది కూడా చదవండి : Mini Switzerland : స్విట్జర్లాండ్ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా!
అనుమతి ఇచ్చిన అమెరికా
కర్రీ మొదట చెట్టు నుంచి చిన్న నమూనా తీసి వయసును అంచనా వేయాలని ప్రయత్నించాడు. అయితే ప్రోమీథియస్ విషయంలో పూర్తి కాండాన్ని పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అమెరికా అటవీ శాఖ అనుమతితో చివరకు ఆ చెట్టును నరికారు. అయితే దాన్ని ఎందుకు నరికాల్సి వచ్చిందన్న విషయంలో వివిధ కథనాలు ఉన్నాయి. అసలు కారణం ఏమిటో పూర్తిగా స్పష్టంగా తెలియదని నేషనల్ పార్క్ సర్వీస్ చెబుతోంది.
చెట్టును నరికిన తర్వాత కాండంలోని వలయాలను లెక్కించగా 4,862 రింగ్స్ కనిపించాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక రింగు ఏర్పడకపోవచ్చని భావించి, ప్రోమీథియస్ వయసును సుమారు 4,900 సంవత్సరాలుగా అంచనా వేశారు. ఆ సమయంలో ఇదే అత్యంత పురాతనమైన చెట్టుగా రికార్డ్ అయింది.
ఇప్పుడు ఆ అవసరం లేదు ..
నేడు ఇలాంటి పురాతన చెట్ల వయసును తెలుసుకోవడానికి వాటిని పూర్తిగా నరకాల్సిన అవసరం లేదు. చెట్టు కాండంలోకి చాలా చిన్న డ్రిల్తో వెళ్లి చెక్క నమూనాను తీసే ‘ఇంక్రిమెంట్ బోరర్’ వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు.
ఆ నమూనాలోని రింగ్స్పై రీసెర్చ్ చేసి చెట్టు వయసును అంచనా వేయవచ్చు. చెట్టుకు తక్కువ నష్టం కలిగించే మరికొన్ని సాంకేతిక పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే.. ప్రోమీథియస్ నరికిన 1964తో పోలిస్తే, నేడు ఇలాంటి పురాతన చెట్లను కాపాడుకుంటూనే వాటి వయసు గురించి తెలుసుకునే అవకాశాలు పెరిగాయి.
నేడు ప్రోమీథియస్ లేదు. అయితే చెట్టు నరకగా మిగిలిన కాండం, మొదలు భాగం నేటికీ అక్కడే ఉంది. వయసు తెలుసుకోవడానికి చెట్టును నరకడంపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ ఘటన తర్వాత పురాతన చెట్లను సంరక్షించడం, వాటిపై పరిశోధనలు నిర్వహించే విధానంపై కూడా చర్చ మొదలైంది.
ప్రోమీథియస్ మాత్రం 1964లో నరికే సమయానికి తెలిసిన అత్యంత పురాతన చెట్టుగా చరిత్రలో నిలిచింది. అయితే 2012లో కాలిఫోర్నియాలో 5,065 ఏళ్ల బ్రిసిల్కోన్ పైన్ అనే మరో చెట్టును గుర్తించారు. ఇప్పుడు ఇదే ప్రపంచంలో ది ఓల్డెస్ట్ ట్రీ. ఈ చెట్టు గురించి వచ్చే వారం చదువుకుందాం.
Image Credit: AI Generated Conceptual Image of Prometheus Tree (WPN-114) stump at Great Basin National Park / prayanikudu.com
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
