Angkor Wat : ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం…కానీ ఇండియాలో లేదు..
Angkor Wat : కొన్ని ప్రదేశాలు చూడటానికి కాదు..అనుభూతి చెందడానికి పుట్టినట్టు అనిపిస్తాయి. అలాంటి ఒక ప్రదేశమే…ఆంగ్కోర్ వాట్ ఆలయ ప్రాంగణం. ఇక్కడ రాళ్లు మాట్లాడితే వినిపించేంతగ నిశ్శబ్దం ఉంటుంది. ఉదయం వెలుగులో మెరిసే గోపురాలు ఉంటాయి. అడవి మధ్యలో నిలిచిన ఒక సజీవ సాక్ష్యం ఈ ఆలయం.
ముఖ్యాంశాలు
చరిత్రతో చేతులు కలిపిన ప్రకృతి | Legacy Of Angkor Wat
కంబోడియాలోని సీయెమ్ రీప్ (Siem Reap) వద్ద ఉన్న అంగ్కోర్ వాట్ని మొదటిసారి చూస్తే అది ఒక ఆలయంతో పాటు ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ప్రతి గోపురం, ప్రతి మెట్టు, ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది.
ఆంగ్కోర్ ఆలయ ప్రాంగణంలో ఉదయం సూర్యోదయం సమయంలో ఆకాశం రంగులు మారిపోతాయి. ఆ ప్రతిబింబం ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో పడటం చూస్తే కాలం కాసేపు ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది.
12వ శతాబ్దంలో నిర్మించిన ఈ మహా కట్టడం నేటికీ వివిధ దేశాల నుండి వచ్చే సందర్శకులను తన వైపు ఆకర్షిస్తూ ఉంది.
అయితే అంగ్కోర్ వాట్ నిజమైన అందం దాని పరిమాణంలో కాదు…దాని మధ్య నడిచే సమయంలో ఫీలయ్యే సైలెన్స్, అడవి చెట్ల వాసనలో, రాళ్ల మీద పడే వెలుగులో ఉంటుంది.
At sunrise, Angkor Equinox Temple in Cambodia reveals a breathtakingly impressive view🥰🌿🌺🪻 pic.twitter.com/m18qMzoTfE
— phai tot (@phaitot28) July 19, 2026
సందర్శనీయ ప్రదేశాలు | Places To Visit
అంగ్కోర్ వాట్ ఆర్కియాలజీ పార్క్ మొత్తం ఒక ఓపెన్ మ్యూజియంలా ఉంటుంది. స్థానికంగా బయోన్ టెంపుల్ (Bayon Temple) లో నవ్వుతున్న ముఖాలను చూస్తే ఆ శిల్పకారుల కలలో మనం కూడా చేరిపోతాము.
తా ప్రోమ్ (Ta Prohm) దగ్గర రాళ్ల మధ్యలో పెరిగిన చెట్లను చూస్తే ప్రకృతి, చరిత్ర మధ్య ఉన్న స్నేహం అర్థం అవుతుంది.
బాంటీ స్రే (Banteay Srei) అనే చిన్న ఆలయంలో ఉన్న చిన్న పింక్ శాండ్‌స్టోన్ శిల్పకళ మనసును హత్తుకునేలా ఉంటుంది. నాటి కళాకారుల ఓపిక, వారి ప్రతిభను గుర్తు చేస్తుంది.
The seven-headed Naga at the entrance of the largest religious monument in the World- Angkor Wat Temple, built by the Hindu King Suryavarman II. pic.twitter.com/eFuuDpfqji
— Raghu (@IndiaTales7) June 19, 2021
ప్రే ఖాన్ (Preah Khan), అంగ్కోర్ థామ్ (Angkor Thom) మధ్య నడుస్తూ వెళ్తే ప్రతి మూలలో ఒక కొత్త దృశ్యం ఎదురవుతుంది. ఎక్కడ చూసినా శిల్పం, చెరువు, గోపురం..అన్ని కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.
రాళ్ల మధ్య సాగే ప్రయాణం
అంగ్కోర్ వాట్లో గడిపే ప్రతి నిమిషం ఒక సినిమా సీన్లా ఉంటుంది. ఉదయం వెలుగులో గోపురాలను ముద్దాడుతుంటే కెమెరా పక్కన పెట్టాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో కేవలం అక్కడే నిలబడి ఆ మౌనాన్ని వింటేనే చాలు అనిపిస్తుంది.
సాయంత్రం చెరువుల పక్కన వీచే గాలిని ఫీలవ్వడం అనేది మాటలకు అందని అనుభవంగా మిగిలిపోతుంది. దూరంగా వినిపించే పక్షుల స్వరాలు, అడవి ఆకుల కదలికలు…ఈ ప్రదేశాన్ని ఇంకా లైవ్లీగా మార్చేస్తాయి. ఇక్కడ ప్రతి అడుగు చరిత్రతో కలిసి నడుస్తున్న అనుభూతిని ఇస్తుంది.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
ఇక్కడ సైకిల్ రైడ్ చేయడం, సన్‌రైజ్‌ని నిశ్శబ్దంగా ఆస్వాదించడం, తా ప్రోమ్ అడవిలో నడవడం, బయోన్ శిల్పాలను దగ్గరగా గమనించడం, సాయంత్రం సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను చూడటం…ఇవన్నీ మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
అడవిలో కనుమరుగైన మహా సామ్రాజ్యం
12వ శతాబ్దంలో ఖ్మేర్ చక్రవర్తి 2వ సూర్యవర్మన్ (Suryavarman II) నిర్మించిన ఈ అద్భుతమైన ఆలయం మొదటిగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు. తరువాత బుద్ధ సంప్రదాయంలో ప్రముఖ ఆరాధన కేంద్రంగా మారింది.
సమయం మారినా…కాలం గడిచినా…శతాబ్దాల పాటు అడవి ఈ మహా కట్టడాన్ని తన ఒడిలో దాచుకున్నా…దాని వైభవం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు.
Bayon Temple🇰🇭✨ pic.twitter.com/aeEOwMtkUF
— Sovan Ratana (@SovanRatana_) April 10, 2026
ఇప్పుడు యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న అంగ్కోర్ వాట్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు..మానవ సృజనాత్మకత శక్తికి, కళ, ఆధ్యాత్మిక భావన, చరిత్ర కలిసిన ఒక సజీవ మహాకావ్యం.
ఎలా వెళ్లాలి ? | How To Go
హైదరాబాద్ నుంచి సియేమ్ రీప్ వెళ్లడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కానీ బ్యాంకాక్, కౌలాలంపూర్ లేదా సింగపూర్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్తో చేరుకోవచ్చు.
ప్రయాణం మధ్యలో ఆకాశం నుంచి కనిపించే పచ్చని పొలాలు, మెకాంగ్ ప్రాంతం దృశ్యాలు జర్నీలో ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి.
విజయవాడ నుంచి వెళ్లాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై మీదుగా అంతర్జాతీయ విమానాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌పోర్టు నుండి సియేమ్ రీప్ నగరం వరకు ప్రయాణం తక్కువ సమయంలోనే పూర్తవుతుంది.
- ఇది కూడా చదవండి : Bhutan Travel Guide 2025 🇧🇹 : భూటాన్ ఎలా వెళ్లాలి? ఖర్చు, ఫుడ్, టిప్స్ | Exploring Bhutan
నగరం నుంచి అంగ్కోర్ ఆర్కియాలజీ పార్క్ (Angkor Archaeological Park) చేరేటప్పుడు రోడ్ పక్కనే కనిపించే చెట్లు, చెరువులు, గ్రామ జీవితం ప్రయాణాన్ని ఇంకా అందంగా మార్చేస్తాయి.
ఎక్కడ ఉండాలి ? | Staying Options
సియేమ్ రీప్‌లో బోటిక్ హోటల్స్, హెరిటేజ్ రిసార్ట్స్, గార్డెన్ స్టేస్ చాలా అందంగా ఉంటాయి. పూల్ పక్కనే నెలకొన్న నిశ్శబ్దం, పచ్చని చెట్లు, ట్రెడిషనల్ ఖ్మేర్ ఆర్కిటెక్చర్ (Khmer Architecture) కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.
ఉదయం కాఫీతో నుంచి సాయంత్రం దీపాల వెలుగులో గార్డెన్స్‌లో కూర్చుని సమయం గడిపే వరకు ఈ గ్రామంలో మీకు ఎక్కడా బోర్ కొట్టదు.
లగ్జరీ రిసార్ట్స్ నుండి సింపుల్ గెస్ట్ హౌస్ వరకు ప్రతి స్టేలో కంబోడియా (Cambodia) ప్రజల మంచి మనసు, వారి సింప్లిసిటీ స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తుంది.
ఏం చూడాలి ? | Sight Seeing In Angkor Wat
అంగ్కోర్ వాట్ వద్ద సూర్యోదయాన్ని చూడటం ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. బయోన్ ఆలయంలో ఉన్న చిరునవ్వులు, తా ప్రోమ్ను ఆక్రమించిన వృక్షాలు, ఆంగ్కోర్ థామ్ ద్వారాలు, ఎలిఫెంట్ టెర్రస్, బాంటీ స్రీ శిల్పకళ…ఇవన్నీ ప్రతిసారి కొత్తగా అనిపిస్తాయి.
సాయంత్రం ఫ్నోమ్ బాఖెంగ్ (Phnom Bakheng) దగ్గర సూర్యాస్తమయంలో ఆకాశంలో రంగులు మెల్లగా మారడాన్ని చూసి ఆస్వాదింవచ్చు. చెరువుల్లో పడిన ఆ వెలుగు ప్రతిబింబం ప్రయాణాన్ని ఒక అందమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది.
ఏం తినాలి ? | Angkor Wat Food To Try
కంబోడియా భోజనంలో ఫ్రెష్‌నెస్ ప్రతి బైట్‌లో మీరు ఫీల్ అవ్వవచ్చు. ఫిష్ అమోక్ (Fish Amok) అనే స్థానిక ట్రెడిషనల్ కర్రీ కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా మధురంగా ఉంటుంది. ఖ్మేర్ కర్రీ, ఫ్రైడ్ రైస్, ట్రాపికల్ ఫ్రూట్స్, ఫ్రెష్ స్ప్రింగ్ రోల్స్, స్టికీ రైస్ డెజర్ట్స్ ప్రతి భోజనాన్ని మరింత రుచికరంగా మార్చుతాయి.
స్ట్రీట్ కేఫ్స్‌లో దొరికే లోకల్ కాఫీ, ఫ్రెష్ ఫ్రూట్స్, ఈవినింగ్ ఫుడ్ మార్కెట్లో ఉన్న వాతావరణం ఇవన్నీ కంప్లీట్ ఫుడ్ ఫ్లేవర్‌ను అందిస్తాయి.
యాత్రా, బడ్జెట్ వివరాలు | Hyderabad To Angkor Wat Travel Budget
హైదరాబాద్ నుండి 5 రోజుల అంగ్కోర్ వాట్ ప్రయాణం బడ్జెట్ కేటగిరీలో ప్లాన్ చేసుకుంటే ప్రతి వ్యక్తికి సుమారు రూ.55,000 నుండి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్టాండర్డ్ ట్రిప్ కోసం రూ.80 వేల నుంచి రూ.1 లక్షా 10 వేల మధ్య ఖర్చు అవుతుంది.
ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.1 లక్షా 40 వేల నుండి రూ.2 లక్షల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను బట్టి కొంచెం అదనపు ఖర్చు అవుతుంది.
స్టే చార్జెస్ బడ్జెట్ హోటల్స్‌లో ఒక రాత్రికి రూ.2,500 నుంచి రూ.5,000 మధ్య ఉంటాయి.స్టాండర్డ్ హోటల్స్ రూ.6,000 నుండి రూ.10,000 వరకు, ప్రీమియం రిసార్టులు రూ.15,000 పైన ఉంటాయి. భోజనానికి ప్రతీ రోజు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య ఖర్చు చేస్తే సరిపోతుంది.
లోకల్ గైడెడ్ హెరిటేజ్ వాక్స్, టుక్ టుక్ రైడ్స్, సన్‌రైజ్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియెన్స్, కల్చరల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఈ ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయే అనుభవంగా మార్చేస్తాయి.
వీసా ఎలా? | Cambodia Visa
భారతీయ ప్రయాణికులకు కంబోడియా వీసా అనేది ఆన్ అరైవల్తో పాటు ఈ-వీసా ( On Arriaval E-Visa) రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
ఆసక్తికరమైన విషయాలు | Quick Facts
- అంగ్కోర్ వాట్ అనేది 1992 నుండి యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ (UNESCO World Heritage Site).
- ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక ఆలయ సముదాయం (Largest Temple Complex) గా గుర్తింపు పొందింది.
- అంగ్కోర్ వాట్ ఆలయం కంబోడియాలోని సియేమ్ రీప్ ప్రావిన్స్ దగ్గర అంగ్కోర్ ఆర్కియాలజికల్ పార్క్‌లో ఉంది.
- ఖ్మేర్ సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళ, నిర్మాణానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు
గమనిక: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారాన్ని స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
