Salar Jung Museum Special: కుర్చీ అంటే ఇది.. టిప్పు సుల్తాన్ వాడిన ఏనుగు దంతాల కుర్చీ చూస్తే మైండ్ పోతుంది
Salar Jung Museum Special: హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట మాత్రమే కాదు. ఇక్కడ భారత చరిత్ర, ప్రపంచ కళా వైభవం ఒకే చోట కనిపిస్తుంది. అదే సాలార్ జంగ్ మ్యూజియం (Salar Jung Museum). దేశంలోనే అతిపెద్ద మ్యూజియాల్లో ఒకటైన ఇక్కడ, భారతీయ, మధ్యప్రాచ్య, యూరోపియన్ కళాఖండాలు ఉన్నాయి. అయితే ఈ మ్యూజియంలోని ఒక ప్రత్యేక గ్యాలరీలో, మైసూరు పులి టిప్పు సుల్తాన్‌కు బహుకరించిన ఏనుగు దంతంతో (Ivory) తయారు చేసిన కుర్చీని భద్రపరిచారు. ఆ అద్భుతమైన కళాఖండం గురించి, మ్యూజియంలోని ఇతర విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏనుగు దంతాల హౌస్ (The Ivory House)
సాలార్ జంగ్ మ్యూజియంలోని హాథీ దాంట్ హౌస్(ఐవరీ హౌస్) అనే విభాగం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఉన్న చాలా వస్తువులు ఏనుగు దంతాలతోనే తయారు చేయబడ్డాయి. ఈ గ్యాలరీలో ఏనుగు దంతాలతో చేసిన కుర్చీలు, దీపాలు, కఠారిల పిడులు, చదరంగం (Chess Set) సెట్లు వంటి అద్భుతమైన ఫర్నిచర్, కళాఖండాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశపు కళాకారులు ఈ దంతాలపై చెక్కిన అద్భుతమైన చెక్కడాలు, వారి నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఇక్కడి చదరంగం పావులు సైనికుల రూపంలో ఉండగా, రాజు, రాణి ఏనుగులపై కూర్చున్నట్లు చెక్కారు.

టిప్పు సుల్తాన్ కుర్చీ ప్రత్యేకత
మ్యూజియంలోని వస్తువులలో అత్యంత విలువైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన వస్తువు టిప్పు సుల్తాన్‌కు బహుకరించిన ఏనుగు దంతాల కుర్చీ. ఈ కుర్చీని లూయిస్ అనే వ్యక్తి టిప్పు సుల్తాన్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ కుర్చీ వెనుక భాగంలో చాలా సున్నితమైన జాలీ డిజైన్ (పొడవైన రంధ్రాలు కలిగిన డిజైన్) ఉంటుంది. దీని చేతి పట్టులపై (Armrests) సింహం తలల చెక్కడాలు కనిపిస్తాయి. ఏనుగు దంతం వంటి గట్టి పదార్థంపై ఇంతటి కళాత్మకమైన పనితనం చూపడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ గ్యాలరీలో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి తీసుకువచ్చిన 19వ శతాబ్దపు ప్రత్యేకమైన చాప కూడా ఉంది. ఈ అపురూపమైన చాపను పూర్తిగా ఏనుగు దంతాలతోనే అల్లారు.
ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
మ్యూజియం సందర్శన వివరాలు (Museum Visit Details)
సాలార్ జంగ్ మ్యూజియం కేవలం కళాఖండాలను మాత్రమే కాకుండా, భారతీయ కళ, మధ్యప్రాచ్య కళ, యూరోపియన్ కళ, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు వంటి వాటితో ఒక భారీ కళా నిలయంగా ఉంది. హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్‌కు చాలా దగ్గరగా ఉన్న దార్ఉల్షిఫా ప్రాంతంలో ఉంది. ఈ మ్యూజియం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రూ.50, పిల్లలకు రూ.20 టికెట్ ధర ఉంటుంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
చరిత్ర ప్రియులు, కళాభిమానులకు ఈ మ్యూజియం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడకు వచ్చి మన దేశపు గొప్ప చరిత్రను, అంతర్జాతీయ కళా వైభవాన్ని దగ్గరగా చూసే అవకాశం దొరుకుతుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
