బెంగళూరు ట్రాఫిక్ కు బై.. గోవా ప్రశాంతతకు హాయ్! | Bengaluru Couple Goa Shift
Bengaluru Couple Goa Shift : నగరాల ట్రాఫిక్, ఉరుకుల పరుగుల జీవితం నుంచి బయటపడాలని చాలామంది కోరుకుంటారు. అయితే అందుకోసం ఉద్యోగాలు, అలవాట్లు మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేవారు కొందరే. అలాంటి నిర్ణయమే తీసుకున్నారు బెంగళూరుకు చెందిన రాధిక, ఏకాన్ష్ దంపతులు. ఏడేళ్ల బెంగళూరు జీవితానికి గుడ్‌బై చెప్పి గోవాలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Radhi and Ekansh’ పేరుతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. రిమోట్ ఉద్యోగాలు లభించడం, ప్రశాంతమైన జీవితం గడపాలనే కోరిక వీరి నిర్ణయానికి ప్రధాన కారణాలు.
ఏకాన్ష్కు గత ఏడాది నుంచే రిమోట్ ఉద్యోగం ఉండగా, రాధిక ప్రొడక్ట్ మేనేజర్‌గా హైబ్రిడ్ విధానంలో పనిచేసేవారు. గోవాకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఎనిమిది నెలల పాటు రిమోట్ ఉద్యోగం కోసం ప్రయత్నించి కొత్త ఉద్యోగం సంపాదించారు.
బెంగళూరులో నెలకు రూ.1.3 లక్షల ఖర్చు
మే నెలలో షేర్ చేసిన వీడియో ప్రకారం, బెంగళూరులో వీరి ఇంటి అద్దె నెలకు రూ.56,000. విద్యుత్, నీటి బిల్లులు, ప్రయాణం, బయట భోజనం, ఫుడ్ ఆర్డర్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, షాపింగ్ కలిపి మొత్తం నెలవారీ ఖర్చు సుమారు రూ.1.3 లక్షలకు చేరేది.
సొంత ఇల్లు కొనకపోవడం వల్ల ఈఎంఐ భారం లేకుండా ఉద్యోగం, నివాసం మార్చుకునే స్వేచ్ఛ లభించిందని చెబుతున్నారు.
- ఇది కూడా చదవండి : Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే
గోవా షిఫ్టింగ్‌కు ఎంత ఖర్చయింది?
అక్టోబర్ 30న వెల్లడించిన వివరాల ప్రకారం, సామాన్ల స్టోరేజ్‌కు రూ.15,000, లగేజ్ తరలింపునకు రూ.24,000, రోడ్ ట్రిప్‌కు రూ.10,000, ఇల్లు వెతికేందుకు రూ.5,000, ఆహారం, గ్రోసరీకి రూ.12,000, ఇంటి సెటప్‌కు రూ.9,500 ఖర్చు చేశారు. మొత్తం రూ.75,500 అయింది.
ఇల్లు దొరికే వరకు మూడు వారాలు Airbnbలో ఉండటానికి మరో రూ.45,000 ఖర్చు చేశారు. అయితే దాన్ని అదనపు ఖర్చుగా పరిగణించలేదు.
ఐదు రోజుల గోవా ట్రిప్‌కే రూ.30,000 నుంచి రూ.40,000 ఖర్చు చేసే బదులు, రూ.75,500తో కొత్త జీవితాన్ని ప్రారంభించడం తమకు పూర్తిగా విలువైన నిర్ణయమని రాధిక చెబుతున్నారు.
ఉద్యోగం ఎక్కడ ఉన్నా చేసుకునే అవకాశం ఉంటే ప్రశాంతమైన జీవితం కోసం నగరాన్ని వదిలేయవచ్చని ఈ జంట కథ చెబుతోంది.
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
