గంగాతీరంలో ఉన్న భోళా శంకరుడి అత్తారిల్లు విశేషాలు | Daksheshwar Mahadev Temple
Daksheshwar Mahadev Temple: దక్ష ప్రజాపతికి తన కూతురు సతీ దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఒక మహా యాగాన్ని నిర్వహించినప్పుడు సతీ దేవిని, మహా శివుడిని ఆహ్వానించడు.
అయితే పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో సతీ దేవి శివుడు నిరాకరించినప్పటికీ అక్కడికి వెళుతుంది. సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను భక్తులు శక్తి పీఠాలుగా కొలుస్తారు. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాల సంఖ్య 51, 52, 64 లేదా 108గా వేర్వేరు సంప్రదాయాల్లో చెప్పబడుతుంది.
అయితే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) హరిద్వార్ సమీపంలోని కంఖాల్ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని భక్తులు విశేషంగా పూజిస్తారు. హిందూ పౌరాణిక చరిత్రలో ఈ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది.
దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం హరిద్వార్ రైల్వే స్టేషన్ (Haridwar) నుంచి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో కంఖాల్ ప్రాంతంలో ఉంది. గంగానది తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ ఆలయం భక్తులకు చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.
- ఇది కూడా చదవండి : Arunachalam: అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా? గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? పూర్తి గైడ్
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే అందమైన శిల్పకళ ఆకట్టుకుంటుంది. ముందుగా సత్య శివసాధన ఆలయం, తరువాత శ్రీ దక్ష యజ్ఞ కుండం దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఇక్కడే దక్ష ప్రజాపతి మహా యజ్ఞాన్ని నిర్వహించినట్లు చెబుతారు.
సతీ కుండ్… శక్తి పీఠాల కథకు ఆది
ప్రధాన ఆలయం లోపల ఉన్న సతీ కుండ్ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీ దేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహా శివుడు సతీ దేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీ మహా విష్ణువు సుదర్శన చక్రంతో సతీ దేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి.
ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు.

ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపున గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రంగా చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృ కార్యాలు, నదీ పూజలు, పిండదానాలు నిర్వహిస్తారు.
దక్ష యజ్ఞం… అహంకారానికి ముగింపు
దక్ష ప్రజాపతికి తన కూతురు సతీ దేవి (Sati Devi) పరమ శివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఒక మహా యాగాన్ని నిర్వహించినప్పుడు సతీ దేవిని, మహా శివుడిని ఆహ్వానించడు. అయితే పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో సతీ దేవి శివుడు నిరాకరించినప్పటికీ అక్కడికి వెళుతుంది.
- ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
సతీ దేవిని చూసిన దక్షుడు మహా శివుడిని అవమానిస్తాడు. ఈ అవమానాన్ని భరించలేక సతీ దేవి అక్కడే ఉన్న యజ్ఞ కుండంలో అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న మహా శివుడు ఉగ్రరూపం ధరించి వీరభద్రుడిని సృష్టించి దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు.
వీరభద్రుడు దక్షుడి తలను వేరు చేస్తాడు. తరువాత దేవతల ప్రార్థన మేరకు శివుడు దక్షుడికి మేక తలను అమర్చి యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాడు. అయితే సతీ వియోగం శివుడిని తీవ్రంగా కలచివేస్తుంది.
శివ తాండవం… శక్తి పీఠాల ఆవిర్భావం | Origin Of Shakti Peethas
సతీ దేవి శరీరాన్ని మోస్తూ శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన మహా విష్ణువు సుదర్శన చక్రంతో శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి. ఆ భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా (Shakti Peethas) భక్తులు పూజిస్తున్నారు.
దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు.
ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించడం మంచిది. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక ఆలయం మాత్రమే కాదు… అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.
- ఎం.జి.కిశోర్, Prayanikudu.com
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఇదే పోస్టు sakshi.com లో కూడా పబ్లిష్ అయింది.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
గమనిక :
ఈ కథనంలో పేర్కొన్న అంశాలు పౌరాణిక విశ్వాసాలు, స్థానిక సంప్రదాయాల, కథనాల అధారంగా అందించబడ్డాయి.







