Biosecurity Rules : నవ్య నాయర్ కాదు, ఎవరైనా సరే.. ఆ దేశంలో పువ్వులకు నో ఎంట్రీ!
Biosecurity Rules : మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా? ప్రత్యేకించి ఆస్ట్రేలియాకు వెళ్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మలయాళ నటి నవ్య నాయర్ పువ్వులు తీసుకువెళ్లినందుకు ఆమెకు ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వస్తువులపై ఇంత కఠినమైన నియమాలు ఎందుకు పెట్టింది? పువ్వులు, ఆహార పదార్థాలపై ఎందుకు నిషేధం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ సంస్కృతిలో పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ఇంటి వంటకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణించేటప్పుడు వీటిని వెంట తీసుకువెళ్లడం సాధారణంగా జరుగుతుంది. కానీ, ఆస్ట్రేలియాలో ఈ విషయాల్లో కఠినమైన నియమాలు ఉన్నాయి. ఇటీవల మలయాళ నటి నవ్య నాయర్‌కు ఆమె పువ్వులు తీసుకువెళ్లినందుకు ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా విధించారు. దీంతో ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ నియమాలు చర్చనీయాంశంగా మారాయి.

ఆస్ట్రేలియాలో నిషేధిత వస్తువులు
ఆస్ట్రేలియాకు విదేశాల నుంచి తీసుకొచ్చే వస్తువులపై అనేక నిషేధాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ నియమాలను అతిక్రమించినట్లయితే భారీ జరిమానాలు, కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడవచ్చు. కింది వస్తువులను ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లడంపై నిషేధం ఉంది.
- తాజా లేదా ఎండిన పూలు
- పండ్లు, కూరగాయలు
- సుగంధ ద్రవ్యాలు, మూలికలు
- పచ్చి గింజలు
- పాలు, పాల ఉత్పత్తులు (బర్ఫీ, రసమలై, రసగుల్లా వంటివి)
- బియ్యం, టీ
- తేనె
- ఇంటిలో తయారుచేసిన ఆహారం
- పక్షులు, జంతువుల ఈకలు, ఎముకలు
- తోలుతో తయారు చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్పట్లు
ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
నియమాలు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాయి?
ఆస్ట్రేలియా ఖండం చుట్టూ మహాసముద్రం ఉంది. దీనివల్ల ఇక్కడి జీవజాతులు మిగతా ప్రపంచంలోని జీవజాతులతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పరిణామం చెందాయి. ఈ కారణం చేత ఒకవేళ కొత్త జీవజాతులు, వ్యాధులు లేదా తెగుళ్లు బయట నుంచి వస్తే, అవి స్థానిక జంతు, మొక్కల జాతులకు ముప్పుగా మారతాయి.
ప్రమాదాలు
స్థానిక జాతులకు ముప్పు: విదేశీ జీవులు ప్రవేశిస్తే, స్థానిక జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ఆహార పోటీ: కొత్త జాతులు ఆహారం, వనరుల కోసం స్థానిక జీవులతో పోటీ పడతాయి, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది.
పంట నష్టం: విదేశీ తెగుళ్లు, వ్యాధులు వ్యవసాయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ బయోసెక్యూరిటీ నియమాలను చాలా సీరియస్‌గా అమలు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు తమ వెంట నిషేధిత వస్తువులను తీసుకొచ్చినప్పటికీ, ముందుగానే అధికారులకు తెలియజేస్తే, వారికి జరిమానా విధించరు. అధికారులు ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని వెంటనే నాశనం చేస్తారు. కానీ, సమాచారం దాచి ఉంచి దొరికితే మాత్రం భారీ జరిమానాలు, వీసా రద్దు, జైలు శిక్షకు కూడా అవకాశాలు ఉన్నాయి.
ఈ కఠిన నియమాలు ఆస్ట్రేలియా జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించినవి. ప్రతి ప్రయాణీకుడు ఈ నియమాలను పాటించడం ద్వారా ఆస్ట్రేలియా పర్యావరణాన్ని సంరక్షించడంలో సహాయపడాలి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
