మిజోరాంకు రైలు వచ్చి ఏడాది… 50 కిలోమీటర్లతో పెరిగిన 86% పర్యాటకం | Bairabi Sairang railway
మిజోరాం తొలి రైల్వే లైన్ Bairabi Sairang railway ఏడాది పూర్తయింది. 51 కిలోమీటర్ల లైన్, 114 మీటర్ల ఎత్తైన వంతెన, రైళ్ల వివరాలు, ఐజ్వాల్ ప్రయాణ గైడ్.
ఒకప్పుడు మిజోరాం అంటేనే భయం. విమానం దిగినా, ఆ తర్వాత గంటల తరబడి ఘాట్ రోడ్డులో ఊగుతూ వెళ్లాల్సి ఉండేది. చాలా మంది తెలుగు వాళ్లు ఈశాన్యం వైపు వెళ్లాలంటేనే వెనకడుగు వేసేవారు.
కానీ ఇప్పుడు కథ మారింది. గతేడాది సెప్టెంబర్ 13న మొదటిసారిగా ఐజ్వాల్‌కు రైలు (Aizwal Train) వచ్చింది. బైరాబి నుండి సైరాంగ్ వరకు కేవలం 51 కిలోమీటర్లే అయినా, దాని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది.
ఏడాదిలోనే 15 లక్షల మంది ప్రయాణం చేయడం, అక్కడికి వచ్చే పర్యాటకులు 86 శాతం పెరగడం చూస్తేనే అర్థమవుతుంది.
మామూలు విషయం కాదు..
దారిలో మొత్తం 45 సొరంగాలు తవ్వారు. దాదాపు 16 కిలోమీటర్లు కొండ లోపల నుండే రైలు వెళ్తుంది. 153 వంతెనలు కట్టారు. అందులో ఒక స్తంభం ఎత్తు ఏకంగా 114 మీటర్లు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 42 మీటర్లు ఎత్తు అంటే ఆలోచించండి.
ఈ దారిలో నాలుగు కొత్త స్టేషన్లు వచ్చాయి. హోర్టోకి, కౌన్పుయ్, మువాల్ఖాంగ్, సైరాంగ్. సైరాంగ్ అనేది చివరి స్టేషన్, ఇక్కడి నుండి ఐజ్వాల్ కేవలం 20 కిలోమీటర్లు.
🛤️ Bairabi–Sairang railway line turns One, opening doors to endless opportunities pic.twitter.com/BNXtbuzpOr
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 13, 2026
ఈ రూట్లో ఇప్పుడు నాలుగు రైళ్లు తిరుగుతున్నాయి. ఢిల్లీకి రాజధాని ఎక్స్ ప్రెస్ వెళ్తుండగా, కోల్ కతా, గౌహతి, సిల్చార్ కు కూడా రైల్వేలో ప్రయాణం చేసే వెసులుబాటు వచ్చింది.
ఈ రైళ్లు గత ఏడాదిలో 1100 ట్రిప్పులు తిరిగాయి. అన్ని రైళ్లు ఫుల్ గా, కొన్ని అయితే 140 శాతం పైనే నిండిపోయి నడుస్తున్నాయట.
ఈ రూట్లో సరుకు రవాణా కూడా మొదలైంది. మొదటి రోజే 26 వేల సిమెంట్ బస్తాలతో ఒక గూడ్స్ రైలు వచ్చింది. తర్వాత 119 కార్లతో మరో రైలు. దీంతో అక్కడ సిమెంట్, కార్ల ధరలు కూడా తగ్గాయట.
దీనివల్ల మనకు, ప్రయాణికులకు ఏం లాభం?
ఇది కేవలం రైలు మార్గం కాదు.
1. ప్రయాణం సులువు అయింది. ఇంతకు ముందు గౌహతి నుండి ఐజ్వాల్ కు రోడ్డు మీద 14 గంటలు పట్టేది. ఇప్పుడు రైలులో సైరాంగ్ వరకు వచ్చి, అక్కడి నుండి గంటలో ఐజ్వాల్ వెళ్లిపోవచ్చు. ఖర్చు కూడా సగానికి సగం తగ్గింది.
2. అక్కడి వాళ్లకు ఉపాధి. రైలు రావడంతో హోటల్స్, హోమ్ స్టేలు, టాక్సీలు, గైడ్ లకు పని దొరికింది. మనం వెళ్లినా మోసపోకుండా అన్నీ దొరుకుతాయి.
నేను ఆ వంతెన ఫోటోలు చూసినప్పుడు నాకేం అనిపించింది అంటే.. ఈ దారిలో ప్రయాణం చేస్తే విండో సీట్ పక్కా తీసుకోవాలి అని. ఎందుకంటే లోయ అందాలు అంత బాగుంటాయి.
మీరు వెళితే దీన్ని ఎక్కడ చూడవచ్చు? | Mizoram Train Journey
మీరు మిజోరాం ప్లాన్ చేస్తే, సైరాంగ్ స్టేషన్ ను తప్పక చూడండి. చాలా కొత్తగా, శుభ్రంగా కట్టారు. రోజూ 3300 మంది వస్తున్నారు. స్టేషన్ చుట్టూ స్థానికులు మొక్కలు నాటారు.
ఇక సైరాంగ్ వంతెన దగ్గర రైలు వెళుతున్నప్పుడు ఆ ఎత్తు చూస్తే కొంచెం భయం, కొంచెం ఆశ్చర్యం కలుగుతాయి.
హోర్టోకి, మువాల్ఖాంగ్ మధ్యలో సొరంగాల నుండి బయటకు రాగానే కనిపించే దృశ్యాలు ఫోటోలకు చాలా బాగుంటాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
1. సైరాంగ్ నుండి ఐజ్వాల్ కు ఎలా వెళ్లాలి? | Sairang To Aizwal
స్టేషన్ బయటే షేర్డ్ సుమోలు, టాక్సీలు ఉంటాయి. 20 కిలోమీటర్లు, గంటలో వెళ్లిపోతారు.
2. హైదరాబాద్ నుండి నేరుగా రైలు ఉందా? | Hyderabad To Mizoram Train
లేదు. మీరు హైదరాబాద్ నుండి గౌహతి వరకు వెళ్లి, అక్కడి నుండి సైరాంగ్ రైలు ఎక్కాలి. లేదంటే ఢిల్లీ వెళ్లి అక్కడి నుండి రాజధాని ఎక్కవచ్చు.
3. అనుమతి కావాలా? | Mizoram ILP
అవును, ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి. ఆన్ లైన్ లోనే తీసుకోవచ్చు. లేకపోతే స్టేషన్ లో ఆపుతారు.
Source: PIB Delhi
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
