Border Tourism India : దేశ అంచుల్లో 5 అద్భుత యాత్రలు
Border Tourism India : కొన్ని ప్రయాణాలు కేవలం కొత్త ప్రదేశాలను మాత్రమే చూపించవు. మన దేశం ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత వైవిధ్యంగా ఉందో మనకి కొత్త కోణంలో చూపిస్తాయి. భారత దేశ సరిహద్దుల్లో ఉన్న ఈ ఐదు ప్రయాణాలు అలాంటి అనుభవాలే ఇస్తాయి.
ముఖ్యాంశాలు
భారత సరిహద్దుల్లో ఒక ప్రయాణం | Trip To Indian Border Destinations
భారత్ అనే దేశం… మ్యాపులో గీసిన గీతల సమూహం కాదు. హిమాలయాల నుంచి రాజస్థాన్ ఎడారి వరకు, పంజాబ్ పచ్చని నేల నుంచి గుజరాత్ ఉప్పు భూముల వరకు, ప్రతీ సరిహద్దు, ప్రతీ చివరి గ్రామం భారత దేశ వైభవాన్ని చాటుతోంది. ఈ వారం మన యాత్ర అలాంటి ఐదు అద్భుతమైన బార్డర్ టూరిజం డెస్టినేషన్ వైపు..
మేఘాల మధ్య బూమ్లా పాస్ | Bum La Pass
Arunachal Pradesh | India–China Border
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ నుంచి బూమ్లా పాస్ వైపు వెళ్తుంటే ప్రతీ మలుపు ఒక కొత్త పెయింటింగ్‌లా కనిపిస్తుంది. మేఘాలు రోడ్డుమీద నడుస్తున్నట్టు, దూరంగా హిమ శిఖరాలు వెలుగుతున్నట్టు అనిపిస్తాయి. దాదాపు 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరిహద్దు ప్రకృతి, దేశభక్తి రెండూ కలిసిన ఒక వినూత్న ప్రదేశం.
ప్రయాణంలో మధ్యలో సాంగెత్సర్ లేక్ (Sangetsar Lake), సేలా పాస్ (Sela Pass) అందం, తవాంగ్ మోనాస్టరీ ప్రశాంతత ఈ ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చేస్తాయి.
టిబెటన్ సంస్కృతి ప్రభావం ఉన్న చిన్న చిన్న హోటల్స్‌లో ఉండటం, చల్లని వాతావరణంలో తూక్పా (Thukpa), మోమోస్, బటర్ టీ రుచులు ఆస్వాదించడం యాత్రకి మరొక జ్ఞాపకంగా, హిమాలయన్ రోడ్డు జర్నీ ఎంజాయ్ చేయడం, ప్రకృతి నిశ్శబ్దాన్ని వినడం ఇక్కడ మర్చిపోలేని అనుభవాలుగా మిగిలిపోతాయి.

గమనిక : అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలంటే ముందుగా ఇన్నర్ లైన్ పర్మిట్ (ILP) తప్పనిసరి. బుమ్ లా పాస్ వెళ్లాలంటే స్థానిక డిప్యూటీ కమిషనర్ (DC/DM) కార్యాలయం నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాలి.
వాఘా బార్డర్ | Wagah Border
Punjab | India–Pakistan Border
పంజాబ్‌లోని అమృత్సర్ దగ్గర ఉన్న వాఘా బార్డర్లో సాయంత్రం అయితే వాతావరణం మారిపోతుంది. సూర్యాస్తమయం వెలుగుల్లో భారత్, పాకిస్తాన్ సరిహద్దు ఒక వేదికగా మారుతుంది. బీఎస్ఎఫ్ పరేడ్, జాతీయ గీతాలు, జనాల హర్షధ్వానాలు కలిసి దేశ భక్తి భావాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే మూమెంట్ అది.
హైదరాబాద్ (Hyderabad) నుంచి అమృత్సర్ చేరిన తరువాత రోడ్ జర్నీలో పంజాబ్ పచ్చని పొలాలు స్వాగతం చెబుతాయి. హెరిటేజ్ హోటల్స్‌లో ఉండటం, పంజాబీ ఆతిథ్యం అనుభవించడం, అమృత్సరి కుల్చా, లస్సీ, సర్సోన్ కా సాగ్ రుచులు ఆస్వాదించడం ప్రయాణంలో భాగం అయిపోతాయి.
గోల్డెన్ టెంపుల్ ప్రశాంతత, బార్డర్ సెరిమనీ ఉత్సాహం, లోకల్ బజార్ల సందడి కలిసి ఈ యాత్ర మరింత అర్థవంతంగా ఉంటుంది.
నాథులా పాస్ | Nathu La Pass
Sikkim | India–China Border
సిక్కిమ్‌లోని గ్యాంగ్‌టక్ (Gangtok) నుంచి నాథు లా పాస్ వైపు వెళ్తుంటే మేఘాలు రోడ్డుని ఆలింగనం చేసినట్టు ఉంటాయి. ప్రాచీన సిల్క్ రోడ్డు భాగమైన ఈ ప్రదేశం ప్రకృతి అందానికి ప్రతీకగా నిలుస్తుంది.
దారి మధ్యలో త్సోంగో లేక్ (Tsomgo Lake) నీళ్లు ఆకాశాన్ని ప్రతిబింబిస్తాయి. బాబా హర్భజన్ సింగ్ మందిర్ (Baba Harbhajan Singh Mandir) దగ్గర మౌనంగా సాగే ప్రయాణం స్థానిక కథలను, సైనికుల త్యాగాలను గుర్తు చేస్తుంటాయి.
- ఇది కూడా చదవండి : రూ.19,999 కే భూటాన్ వెళ్లే బడ్జెట్ ప్యాకేజ్
మౌంటెన్ లాడ్జెస్లో గడిపిన రాత్రులు, గరం మోమోస్, నూడిల్స్ సూప్, సిక్కిం టీ రుచులు చల్లని గాలికి చక్కగా కలిసిపోతాయి. సరస్సుల దగ్గర సమయం గడపడం, హిమాలయాలను ఆస్వాదించడం, లోకల్ సంస్కృతిని గమనించడం, రోడ్డు జర్నీని అనుభవించడం, మేఘాల మధ్య ఫోటోగ్రఫీ చేయడం ఈ ట్రిప్‌ని ఒక మెమొరబుల్ జర్నీగా మారుస్తుంది.
లాంగేవాలా | Longewala
Rajasthan | India–Pakistan Border
రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి లాంగేవాలా వైపు ప్రయాణం మొదలైతే భూమి రంగులు మెల్లగా మారడం కనిపిస్తుంది. బంగారు ఇసుక దిబ్బలు, విశాలమైన ఆకాశం, మౌనంగా నిలిచిన యుద్ధ జ్ఞాపకాలు ఈ ప్రదేశానికి ప్రత్యేక గుర్తింపుగా మారాయి.
లాంగేవాలా వార్ మెమోరియల్ దగ్గర చరిత్ర నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. డెజర్ట్ క్యాంప్స్లో ఉండటం, రాజస్థాని ఆతిథ్యం ఆస్వాదించడం, దాల్ భాటీ చూర్మా, కేర్ సంగ్రీ రుచులు అనుభవించడం యాత్రని పూర్తి చేస్తాయి. క్యామెల్ సఫారీ, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఎడారి గాలి, చరిత్ర కలిసి ఇక్కడ మరిచిపోలేని క్షణాలను అందిస్తాయి.
తెల్లని భూమి… గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ | Great Rann of Kutch
Gujarat | India–Pakistan Border
గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ చేరగానే భూమి మొత్తం తెల్లని వెలుగుతో మెరుస్తుంది. ఉప్పు భూమి మీద పడిన సూర్యకాంతి ఒక కొత్త లోకంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది.
భుజ్ నుంచి ప్రయాణం మొదలైతే కచ్చీ సంస్కృతి ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది. తెల్లని ఎడారి మధ్య క్యాంపుల్లో ఉండటం, కచ్చీ ఎంబ్రాయిడరీ చూడటం, లోకల్ ఫోక్ మ్యూజిక్ వినడం, డాబెలి, కచ్చీ థాలీ రుచులు ఆస్వాదించడం ఒక మధురమైన అనుభవంగా మిగిలిపోతుంది. కాలో డుంగర్ నుంచి విశాలమైన రాన్ని చూడటం, సాయంత్రం ఆకాశంలో రంగులు మారడం ఈ ప్రయాణాన్ని ఒక జ్ఞాపకంగా నిలబెడుతుంది.
యాత్రా, బడ్జెట్ వివరాలు | Yatra, Budget
హైదరాబాద్ నుంచి ఈ బార్డర్ టూరిజం డెస్టినేషన్‌లో ఏదైనా ఒకటి ఎంచుకుని ఐదు రోజుల ప్రయాణం ప్లాన్ చేస్తే బడ్జెట్ కేటగిరిలో సుమారు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు ఖర్చు అవుతుంది. స్టాండర్డ్ కంఫర్ట్ జర్నీ రూ.50,000 నుంచి రూ.70,000 మధ్య ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ రూ.80,000 నుంచి రూ.1,10,000 వరకు ఉండవచ్చు. విజయవాడ నుంచి హైదరాబాద్ లేదా డైరెక్ట్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా ఈ ప్రయాణాలు సులభంగా మొదలవుతాయి.
అకామొడేషన్ అనేది మీ లైఫ్ స్టైల్‌ను బట్టి సుమారు రూ.600 నుంచి రూ.7,000 మధ్య దొరుకుతుంది. ఫుడ్ రోజుకు రూ.700 నుంచి రూ.1,500 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. లోకల్ సైట్‌సీయింగ్ ప్యాకేజీలు, షేర్డ్ వెహికల్స్, ప్రైవేట్ క్యాబులు ప్రదేశాన్ని బట్టి అందుబాటులో ఉంటాయి. ఈ ఐదు డెస్టినేషన్స్ అన్ని భారత్‌లోనే కాబట్టి వీసా అవసరం లేదు.
ఆసక్తికరమైన విషయాలు | Quick Facts
బూమ్లా పాస్ అనేది భారత్–చైనా సరిహద్దుపై అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది.
వాఘా బార్డర్లో ప్రతీ సాయంత్రం జరిగే బీటింగ్ రిట్రీట్ సెరిమనీ చాలా పాపులర్.
నాథు లా పాస్ అనేది ప్రాచీన సిల్క్ రూట్లో ముఖ్యమైన మార్గం.
లాంగేవాలా 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధ చరిత్రకి ఒక ప్రతీకగా నిలిచింది.
గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ అనేది ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు ఎడారి ప్రదేశాలలో ఒకటి.
ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
గమనిక
ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.
ఈ వీడియో కూడా చూడండి
