1000 ఏళ్ల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవం ఎలా జరిగేదో తెలుసా? శాసనాల్లో బయటపడ్డ అసలు నిజం! | Tirumala Brahmotsavam Origin
Tirumala Brahmotsavam Origin : శాసనాల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్ర ఏంటో తెలుసా? 966లో పల్లవ రాణి దానం నుంచి ఏడాదికి 10 ఉత్సవాల వరకు 1000 ఏళ్ల వైభవం పూర్తి Timeline…
తిరుమలలో బ్రహ్మోత్సవాలంటే తొమ్మిది రోజుల పాటు సప్తగిరులు భక్తి పారవశ్యంతో మార్మోగే మహోత్సవం. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం సాయంత్రం వాహన సేవల నుంచి లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ వరకు నేడు కనిపిస్తున్న ఈ వైభవం ఒక్కరోజులో రూపుదిద్దుకున్నది కాదు.
శతాబ్దాలుగా రాజులు, రాణులు, సామంతులు, అధికారులు, భక్తులు అందించిన దానధర్మాలు, ఆలయ పరిపాలనా పరిణామాలు, ఆగమ సంప్రదాయాలు, కాలానుగుణంగా ఏర్పడిన ఉత్సవాలు ఇవన్నీ కలసి నేటి శ్రీవారి బ్రహ్మోత్సవాల రూపాన్ని తీర్చిదిద్దాయి.
ఈ చరిత్రకు పురాణాలు మాత్రమే ఆధారం కాదు. తిరుమల ఆలయ గోడలపై చెక్కిన శాసనాలే (Inscriptions) ఈ ఉత్సవ పరిణామానికి అత్యంత విలువైన చారిత్రక ఆధారాలు. టీటీడీ ప్రచురించిన శాసన సంపుటాలు ఈ వైభవానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.
బ్రహ్మ నిర్వహించిన ఉత్సవం | The Festival Conducted by Lord Brahma

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆవిర్భావానికి పురాణ పరంపరలో ప్రత్యేక కథనం ఉంది. శ్రీనివాసుడు వెంకటాద్రిపై అవతరించిన సందర్భంగా బ్రహ్మదేవుడు తొలిసారిగా ఉత్సవాలను నిర్వహించాడని అందుకే ఈ ఉత్సవానికి బ్రహ్మోత్సవం అనే పేరు వచ్చిందని పురాణ ప్రాశస్త్యం.
966 – కీలక మైలురాయి | 966 CE – A Crucial Milestone
పల్లవ రాజవంశానికి చెందిన రాణి సామవై పెరుందేవి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించింది. ఆమె అనేక ఆభరణాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు భూములను కూడా దానం చేసింది.
ఆమె దానశాసనం తిరుమల ఆలయ మొదటి ప్రాకారంలోని ఉత్తర గోడపై చెక్కబడి ఉంది. ఈ శాసనం ఆధారంగా 10వ శతాబ్దంలోనే బ్రహ్మోత్సవాలు వ్యవస్థీకృతంగా నిర్వహించబడుతున్నట్లు తెలుస్తోంది. పెరటాసి మాసంలో ప్రధాన బ్రహ్మోత్సవంతో పాటు మార్గశిర మాసంలో మరో బ్రహ్మోత్సవం నిర్వహించేందుకు సామవై ఏర్పాట్లు చేసింది.
రెండు ఉత్సవాల నుంచి ఐదు బ్రహ్మోత్సవాల వరకు | From Two Festivals to Five Brahmotsavams
10వ శతాబ్దంలో కనిపించే ఈ సంప్రదాయం అక్కడితో ఆగలేదు. చోళుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య క్రమంగా పెరిగింది. పెరటాసి, మార్గళి తర్వాత పాంగుని బ్రహ్మోత్సవాన్ని యాదవరాయ సామంతుడు వీర నరసింహ యాదవరాయ కాలానికి ఆపాదించారు.
1254లో చోళ రాజు విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం చేరింది. 1300 నుంచి 1330 మధ్య మరో యాదవరాయ సామంతుడి ఆధ్వర్యంలో ఆడి బ్రహ్మోత్సవం ఏర్పడింది. అలా విజయనగర సామ్రాజ్యం ఏర్పడే నాటికి తిరుమలలో సంవత్సరానికి ఐదు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
విజయనగర సామ్రాజ్యం – స్వర్ణయుగం | Vijayanagara Empire – The Golden Era
సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు వంశాల కాలంలో ఆలయంలో ఉత్సవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 15వ శతాబ్దం నాటికి తిరుమలలో సంవత్సరానికి అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి ఈ సంప్రదాయం చేరింది. విజయనగర కాలం చివరి దశకు వచ్చేసరికి శాసనాల్లో సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాల వరకు నమోదయ్యాయి. 1539 నుంచి 1616 మధ్య పది వార్షిక బ్రహ్మోత్సవాల ప్రస్తావనలు శాసనాల్లో కనిపిస్తాయి.
శ్రీకృష్ణదేవరాయల కాలంలో | During Sri Krishnadevaraya’s Period
1513 ఫిబ్రవరి 10న శ్రీకృష్ణదేవరాయలు తొలిసారి తిరుమలను దర్శించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. 1513లో తన జన్మమాసమైన తై మాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన సేవ కేవలం ఆభరణాలు, నిర్మాణాలు, కానుకలకే పరిమితం కాలేదు. ఉత్సవ సంప్రదాయాన్ని విస్తరించడంలోనూ ఆయన పాత్ర ఉంది.

అచ్యుతరాయల కాలంలో | During Achyutaraya’s Period
1533లో కార్తీక బ్రహ్మోత్సవానికి సంబంధించిన తొలి ప్రస్తావన కనిపిస్తుంది. 1534లో ఈ ఉత్సవానికి విరాళం అందించినట్లు ఒక శాసనం చెబుతోంది. 1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడటంతో వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య మరోసారి పెరిగింది.
ఉత్సవమూర్తి మార్పు – మలయప్పస్వామి | Change of Processional Deity – Malayappa Swamy
1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామివారు (Utsava Murthy) ఉత్సవమూర్తిగా ఉపయోగించబడుతున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారికి వివాహోత్సవాలు, ఇతర ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది.
మహంతుల కాలం నుంచి టీటీడీ వరకు | From Mahants to TTD
1843లో ఆలయ పరిపాలనా బాధ్యతలు హథీరాంజీ మఠాధిపతుల ఆధీనంలోకి వెళ్లాయి. మహంతుల పరిపాలన 1933 వరకు కొనసాగింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) ఏర్పడటంతో ఆలయాలు కొత్త సంస్థాగత పరిపాలనా వ్యవస్థలోకి వచ్చాయి. ఆ తరువాత బ్రహ్మోత్సవం భక్తుల సౌకర్యం, వసతి, రవాణా, భద్రత, వైద్య సేవలు, అన్నప్రసాదం, సమాచార వ్యవస్థ, ప్రత్యక్ష ప్రసారాలు వంటి అనేక విభాగాలతో కూడిన భారీ కార్యక్రమంగా రూపాంతరం చెందింది.
సంక్షిప్త పరిణామం | Timeline at a Glance
966 CE – పల్లవ రాణి సామవై పెరుందేవి దానశాసనం, భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్ఠ
1209-1263 – పాంగుని బ్రహ్మోత్సవం
1254 – చిత్తిరై బ్రహ్మోత్సవం
1300-1330 – ఆడి బ్రహ్మోత్సవం
1339 – మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా
1513 – శ్రీకృష్ణదేవరాయలు తై మాస బ్రహ్మోత్సవం
1533-1534 – కార్తీక బ్రహ్మోత్సవం
1539 – ఆణి బ్రహ్మోత్సవం, పది బ్రహ్మోత్సవాల దశ
1803 – మెకంజీ సర్వేలో 28 ఉత్సవాల ప్రస్తావన
1843 – మహంతుల పాలన ప్రారంభం
1933 – టీటీడీ ఏర్పాటు
Information Source : TTD
▶️ వీడియో చూడండి : పండరిపురం ట్రావెల్ గైడ్
